అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు డ్యూటీల అనుమతుల్లో ప్యాకేజీలు! పెట్రోల్, డీజిల్‌లోనూ గోల్‌మాల్! అక్రమాలపై సిబ్బంది పేరిట లేఖ
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ జిల్లా యాపల్‌గూడలోని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ రెండో బెటాలియన్‌లో పలు అక్రమాలు జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బెటాలియన్ సిబ్బంది పేరిట ఉన్నట్లు పేర్కొంటున్న ఓ లేఖలో బదిలీలు, అటాచ్‌మెంట్‌లు, డ్యూటీల కేటాయింపు, పర్మిషన్లు, పనిష్మెంట్‌లు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం, పెట్రోల్–డీజిల్ వినియోగం, నిర్మాణ పనులు, వెల్ఫేర్, క్యాంటీన్, మెడికల్ కొనుగోళ్లు తదితర అంశాలను ప్రస్తావించారు. కొందరు అధికారులు సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరుపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బదిలీలు, అటాచ్‌మెంట్‌లు, కంపెనీ మార్పులు, డ్యూటీల విషయంలో డబ్బుల వ్యవహారం నడుస్తోందని, పనిష్మెంట్‌లు డ్రాప్ చేయడం, పర్మిషన్లు ఇవ్వడం వంటి అంశాల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని లేఖలో ఆరోపించినట్లు సమాచారం.
బదిలీలు, డ్యూటీలకు ప్యాకేజీ
బెటాలియన్‌లో కంపెనీ నుంచి కంపెనీకి బదిలీలు, వింగ్‌లలో పోస్టింగులు, అటాచ్‌మెంట్‌ల విషయంలో డబ్బుల వ్యవహారం జరుగుతోందని లేఖలో ఆరోపించినట్లు తెలుస్తోంది. మరో బెటాలియన్‌కు అటాచ్‌మెంట్ కావాలంటే పిటిషన్ ఫార్వర్డ్ చేయడానికి సుమారు రూ.15వేల వరకు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. కంపెనీల మార్పులు, అటాచ్‌మెంట్‌లు, డ్యూటీల కేటాయింపుల విషయంలో కొందరి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డ్యూటీలకు హాజరు, సెలవులు, పర్మిషన్లు, ఫ్యాటిగ్స్, గార్డ్ డ్యూటీలు, మూవ్‌మెంట్ల విషయంలోనూ లేఖలో పలు అంశాలున్నాయి. కొందరు సిబ్బంది డ్యూటీలకు హాజరు కాకపోయినా పర్మిషన్లు, సెలవుల విషయంలో అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, రోజుకు రూ.500 చొప్పున ప్యాకేజీ తరహాలో డబ్బులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పనిష్మెంట్ విధించిన అనంతరం దానిని డ్రాప్ చేయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అధికారులు సిబ్బందితో దూషణలకు పాల్పడుతున్నారని, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని కూడా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
విచారణతో వాస్తవాలు వెలుగులోకి..
రెండో బెటాలియన్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వాటిపై విచారణ కోరినట్లు సమాచారం. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, విచారణ జరిగితే అందజేస్తామని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వివరణతో పాటు సంబంధిత ఉన్నతాధికారుల స్పందన కూడా కీలకంగా మారనుంది. లేఖలో పేర్కొన్న అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సిబ్బంది కోరుతున్నట్లు తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్ నుంచి ఎంటీ వింగ్ వరకు..
బెటాలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వింగ్, పెట్రోల్ బంక్ వ్యవహారాలపై లేఖలో ప్రత్యేకంగా ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. వాహనాలకు ఇంధనం నింపే సమయంలో టెస్టింగ్ పేరుతో తీసే పెట్రోల్, డీజిల్‌లో కొంత మొత్తాన్ని సొంత వాహనాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. 40 లీటర్ల టెస్టింగ్‌లో 20 లీటర్లు మాత్రమే పంప్ స్టోరేజ్‌లోకి వెళ్లి, మిగతా 20 లీటర్లను వేరే విధంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు లేఖలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వాహనంలో ప్రయాణికులను ఎక్కించుకుని డబ్బులు వసూలు చేసిన వ్యవహారాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ టెస్టులు, డ్రైవింగ్ డ్యూటీల పిటిషన్లు, ఎంపిక ప్రక్రియపైనా ఆరోపణలున్నాయి. ఎంటీ వింగ్‌లో డ్యూటీలు, మూవ్‌మెంట్లు, అధికారిక–అనధికారిక పర్మిషన్లు, ఆన్‌లైన్ బెట్టింగ్, ఫైనాన్స్ వ్యవహారాలపై కూడా లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇంధన కూపన్లు, లాగ్‌బుక్‌లు, వాహనాల కిలోమీటర్ రీడింగ్‌లు, పెట్రోల్ బంక్ స్టాక్, బిల్లులను పరిశీలిస్తే వాస్తవాలు తేలే అవకాశముంది.


