కడెం: గణేశ్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ధర్మాజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని కుర్రగూడేనికి చెందిన చుంచు రమేశ్ (45) కడెం ప్రాజెక్ట్‌లో పడి మృతి చెందాడు. గురువారం రాత్రి ప్రారంభమైన నిమజ్జన శోభా యాత్ర శుక్రవారం ఉదయం 11గంటలకు గ్రామ సమీపంలోని కడెం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌కు చేరుకుంది. గణేశుడిని నిమజ్జనం చేసే క్రమంలో రమేశ్ ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు. గమనించిన స్థా నికులు వెంటనే అతడిని బయటకు తీసినా అప్పటి కే మృతి చెందాడు. నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన రమేశ్ గ్రామంలో పశువుల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య రమాదేవి, కుమారుడు, కూతురు ఉన్నా రు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


