నిర్మల్ రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం రూరల్ పోలీసులు బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. ఎల్లపల్లి, న్యూ పోచంపాడు, కొండాపూర్, వెంగ్వాపేట్, రత్నాపూర్ కాండ్లీ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో బెల్ట్ షాపులపై దాడి నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్లపల్లిలో రూ.93,620 విలువైన 202 లీటర్ల మద్యం, న్యూపోచంపాడులో రూ.27,330 విలువైన 58.3 లీటర్లు, కొండాపూర్‌లో రూ.1,74,658 విలువైన 264.33 లీటర్లు, వెంగ్వాపేట్‌లో రూ.39,650 విలువైన 80 లీటర్లు, రత్నాపూర్‌కాండ్లీలో రూ.97,250 విలువైన 174 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై లింబాద్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మద్యం విక్రయించడం, బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


