భైంసారూరల్: తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఈనెల 10న జిల్లా కేంద్రం నిర్మల్‌లో నిర్వహించిన మహిళా మహోత్సవం రుణమేళాలో భైంసా మండలం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. మండలంలోని 73 మహిళా సంఘాలకు రూ.10.44 కోట్ల రుణాలను మంజూరు చేయించి ఈ ఘనత సాధించింది. జిల్లాస్థాయిలో ఏపీఎంలకు అవార్డులు ప్రకటించగా.. అందులో ప్రథమ అవార్డు భైంసా మండల ఏపీఎం రమేశ్‌కు దక్కింది. లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్, డీఆర్డీవో విజయలక్ష్మీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సీసీల విభాగంలో ప్రకటించిన 10 అవార్డుల్లో భైంసా మండలానికి చెందిన నలుగురు సీసీలు అవార్డులు అందుకున్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందించడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో తక్కువ వ్యవధిలోనే భారీ మొత్తంలో రుణాలు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయిలో భైంసా మండలం ప్రథమ స్థానంలో నిలవడంపై మహిళా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


