నిర్మల్‌ఖిల్లా: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టితో వినాయకుడి ప్రతిమను స్వయంగా తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు నిర్మల్ రూరల్ మండలం అనంతపేటకు చెందిన కళాకారుడు పోలీస్ భీమేశ్. వృత్తిరీత్యా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ స్వచ్ఛంద సంస్థలో సమన్వయకర్తగా పనిచేస్తున్నాడు. ఆయనకు కళలపై ఆసక్తి ఉంది. సహజసిద్ధంగా అలవడిన కళతో రెండున్నర దశాబ్దాలకు పైగా పర్యావరణహిత వినాయక ప్రతిమలు తయారు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చూడచక్కని గణేశుని ప్రతిమకు ప్రాణం పోశారు.
బంకమట్టితో అందమైన గణనాథుడు..
ఈ ఏడాది వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక చెరువులో లభించే సహజసిద్ధమైన బంకమట్టిని సేకరించి, దానితో గణనాథుడి ప్రతిమను రూపొందించారు. సహజసిద్ధమైన నీటిరంగులతో ప్రతిమకు తుదిమెరుగులు అద్దారు. వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తామని భీమేష్ తెలిపాడు. పండుగ సంబరాలతోపాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని తన కళ ద్వారా చాటుతున్నాడు భీమేశ్.
మట్టి గణేశుని ప్రతిమతో పోలీస్ భీమేశ్


