భైంసా: సుమారు రెండు దశాబ్దాలుగా రైతులను పట్టిపీడిస్తున్న భూముల ప్రొహిబిషన్ సమస్యకు పరిష్కారం లభించే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. పెరల్స్ అగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ భూముల కొనుగోలు, తదనంతర న్యాయపరమైన పరిణామాల కారణంగా తానూరు మండలంతో పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వేల ఎకరాల భూములు ప్రొహిబిషన్ జాబితాలో చిక్కుకున్నాయి. దీంతో భూములు విక్రయించని రైతులూ ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టేందుకు ఆయన ముందుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో తానూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఇటీవల కలెక్టర్‌ను కలిసి సమస్యలు వివరించారు. ఒక సర్వే నంబర్‌లో కొంత భూమిని మాత్రమే పెరల్స్ అగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసినప్పటికీ, అదే సర్వే నంబర్‌లోని మొత్తం భూములను ప్రొహిబిషన్‌లో పెట్ట డంతో భూములు అమ్మని రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పట్టాదారులు మరణించిన సందర్భాల్లో వారసుల పేరిట పట్టా మార్పిడి జరగడంలేదని, భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయని, బ్యాంక్ రుణాలు పొందలేకపోతున్నామని, ప్రభుత్వ రాయితీలు, రైతు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని రైతులు కలెక్టర్ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు.
నేరుగా రైతులతో ముఖాముఖి
సమస్య తీవ్రతను గుర్తించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా రైతులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు బుధవారం తానూరు మండలంలోని మొగిలి గ్రామాన్ని సందర్శించారు. సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవోతో పాటు ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. మొగిలితో పాటు కోలూరు, జరీ (బి), హిప్పెల్లి తండా, బెంబర్‌బోసి, మహాలింగి, కోలూరు తండా, తానూరు తదితర గ్రామాల రైతులు పాల్గొని తమ భూముల పరిస్థితిని వివరించారు.
గ్రామసభల ద్వారా నివేదికలు
ప్రభుత్వ రికార్డులను పరిశీలించడంతో పాటు బాధిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్య ఉన్న ప్రతీ గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల నుంచి పూర్తి వివరాలు సేకరించి సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎదురుచూపులు
మొగిలిలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం జిల్లాలోని ఇతర బాధిత రైతుల్లోనూ ఆశలు రేకెత్తించింది. ఒక్క సర్వే నంబర్‌లోని కొంత భూమి విక్రయం కారణంగా మొత్తం భూమి లాక్ కావడంతో తానూరు మండలంతోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో సుమారు 2,000–2,500 ఎకరాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా రికార్డుల్లో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించి.. తమకు పట్టా హక్కులు, రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని కోరుతున్నారు. కలెక్టర్ చొరవతో ఈ రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో బాధిత రైతులు ఎదురుచూస్తున్నారు.


