వెయ్యిరోజులైనా హామీల అమలేది? | - | Sakshi
Sakshi News home page

వెయ్యిరోజులైనా హామీల అమలేది?

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

నిర్మల్‌ టౌన్‌: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వెయ్యిరోజులైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిర్మల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు రాంకిషన్‌రెడ్డి నివాసం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారంటీల వివరాలతో రూపొందించిన 420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శించి వినూత్న నిరసన తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన కాంగ్రెస్‌ ‘బాకీ కార్డులను’ వాహనదారులు, ప్రయాణికులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం రాంకిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని విస్మరించిందని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, వృద్ధులు, బీడీ కార్మికులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతు భరోసా, వరికి బోనస్‌, రైతు కూలీలకు ఉపాధిహామీ, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యాభరోసా కార్డు తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మోసం చేస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, సీనియర్‌ నాయకుడు అయ్యన్నగారి రాజేందర్‌, కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్వీ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ షోయబ్‌ మీర్జా, నాయకులు సల్మాన్‌, నహీం, విశాల్‌, ఓం ప్రకాశ్‌, జుబేర్‌, మసూద్‌, నజీర్‌, సచిన్‌, హరీశ్‌, రోహిత్‌, అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement