కై లాస్‌నగర్: కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముమ్మరంగా సాగుతుంది. గత నెల 25 నుంచి ఈ ప్రక్రియ మొదలు కాగా ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఇంటింటికీ ఫారాలు అందజేసేందుకు బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వో)లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి ఇంటిని సందర్శించడంతో పాటు అందుబాటులో లేని వారికి ఫోన్ ద్వారా సంప్రదిస్తూ అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 98.2 శాతం ఈ ప్రక్రియ పూర్తయింది. అలాగే ఆదిలాబాద్‌లో 96.41 శాతం కాగా, కుమురంభీంలో 96.31శాతం, మంచిర్యాలలో 85.92 శాతం పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫారాల అందజేత వేగంగా సాగుతుండగా వాటిని పూరించి అందించే ప్రక్రియ మాత్రం స్లోగా ఉంది. ఫారాలను ఏ విధంగా నింపాలనే దానిపై ప్రజల్లో అవగాహన లేకపోవడం, శిక్షణ పొందిన కొంతమంది బీఎల్వోలు సైతం ఓటర్ల సందేహాలను నివృత్తి చేయకపోవడంతో వాటి నమోదులో జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గడువు ఉండటంతో ఫారాలు తీసుకుంటున్న ఓటర్లు వాటిని సక్రమంగా నింపాలనే ఉద్దేశంతో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో స్వీకరణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది.
డిజిటలైజేషన్‌లో కుమురంభీం టాప్..
ఆదివాసీలు అత్యధికంగా ఉన్న కుమురంభీం జిల్లా డిజిటలైజేషన్‌లో అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో అత్యధికంగా ఇప్పటివరకు 18.25 శాతం మంది ఓటర్లు తమ ఫారాలను బీఎల్‌వోలకు అందివ్వగా వారు వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇక మంచిర్యాలలో కేవలం 2.69 శాతం, నిర్మల్ జిల్లాలో 2.99 శాతం కాగా ఆదిలాబాద్‌లో 4.46శాతం ఇప్పటివరకు పూర్తయింది. ఓటరు పూరించి అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈనెల 7వరకు అధికారికంగా ఫారాల పంపిణీ పూర్తి కానుంది. అనంతరం వాటిని స్వీకరించడంపై బీఎల్వోలు దృష్టి సారించనున్నారు. దీంతో వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలు తీరు ఇలా..
జిల్లా మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ డిజిటలైజేషన్
ఆదిలాబాద్ 4,66,784 4,50,042 20,815
నిర్మల్ 7,55,344 7,40,409 22,622
మంచిర్యాల 6,61,467 5,68,344 17,771
కుమురంభీం 4,55,596 4,38,503 83,137


