న్యూస్‌రీల్
మే 11 నుంచి ఇళ్ల లెక్కింపు
ఈసారి డిజిటల్ విధానంలో వివరాల సేకరణ
ట్రిపుల్ ఐటీలో అంతఃప్రజ్ఞ
బాసర ఆర్జీయూకేటీలో శనివారం రెండోరోజు అంతఃప్రజ్ఞ 2కే–26 నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కార్లు, బైక్‌ల ప్రదర్శన నిర్వహించారు.
నృత్య ప్రదర్శనలో ప్రతిభ
లక్ష్మఱచాంద: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భరత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నృత్య ప్రదర్శనలో సోన్ మండలం కడ్తాల్ విద్యార్థి ప్రతిభ కనబర్చింది. గ్రామానికి చెందిన మామిళ్ల ఉమాదేవి–లింగయ్య దంపతుల కూతురు నాలుగేళ్ల సహస్ర స్థానిక నిర్మల్‌కు చెందిన నృత్య కళాకారిణి నవ్య– వినయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వరూపిణి నృత్య కళాక్షేత్రం తరఫునన ముందస్తు ఉగాది ఉత్సవాల్లో పాల్గొంది. సహస్ర అద్భుతంగా నృత్యం చేసి అందరినీ ఆకట్టుకుంది.
నిర్మల్‌చైన్‌గేట్: పదేళ్లకోసారి దేశవ్యాప్తం చేపట్టే జనగణన 2021లో కరోనా మూలంగా నిలిచిపోయింది. దీంతో 2027లో జనగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా మే 11 నుంచి జూన్ 1 వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపడతారు. దీనికోసం జిల్లాకు ఒక మాస్టర్ ట్రైనీని ఎంపిక చేశారు. నిర్మల్ జిల్లాకు మాస్టర్ ట్రైనర్‌గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.గంగారెడ్డి ఈనెల 5 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. అలాగే జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్లుగా 26 మందిని ఎంపిక చేశారు.
మొదటి దశలో ఇళ్లు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన ఎంతగానో దోహదపడుతోంది. పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన నిర్వహిస్తుండగా.. చివరిసారిగా 2011లో చేపట్టింది. జిల్లాలో ఈ గణన రెండు దశల్లో జరగనుంది. మొదటగా ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో దశలో జనాభా గణన 2027, ఫిబ్రవరిలో జరగనుంది.
మూడు రోజుల శిక్షణ..
హౌస్ లిస్టింగ్ నుంచి ఇంటింటి సర్వే పూర్తయ్యేదాకా మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలకు మండల చార్జ్ ఆఫీసర్ పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, చార్జ్ ఆఫీసర్లుగా టీపీవో/మేనేజర్లు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం 26 మంది ఫీల్డ్ ట్రైనర్లకు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 430 రెవెన్యూ గ్రామాల్లో జనగణన చేపట్టేందుకు మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపట్టనున్నారు. ఇళ్ల సంఖ్య, కుటుంబాల సంఖ్య ఆధారంగా ఎన్యుమరేటర్లను నియమించి, వచ్చే ఏడాది జనగణన చేపట్టనున్నారు.
ప్రత్యేక పోర్టల్ ద్వారా..
ఈసారి జన గణనను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. మొబైల్ యాప్‌లో, వెబ్ పోర్టర్లను ఉపయోగించి ఈ ప్రక్రియ ఉండనుంది. అలాగే ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఈ ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి..? గణన ప్రక్రియ ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు శిక్షణతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం అధికారులు బ్లాక్‌లను గుర్తించి ఎంపిక చేసిన ఎన్యూమరేటర్ల ద్వారా ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నేటి నుంచి చార్జ్ ఆఫీసర్లకు,
28 నుంచి ఫీల్డ్ ట్రైనర్స్‌కు శిక్షణ
2011 లెక్కల ప్రకారం జిల్లా వివరాలు..
భౌగోళిక విస్తీర్ణం : 3,692.3
స్క్వేర్ కిలోమీటర్
రెవెన్యూ గ్రామాలు : 430
మండలాలు : 18
మున్సిపాలిటీలు : 3
పంచాయతీలు : 400
జనాభా
(2011 లెక్కల ప్రకారం) : 7,09,418
పురుషులు : 3,46,721
మహిళలు : 3,62,697
కుటుంబాలు : 1,65,763
కొత్త జిల్లాల్లో మొదటిసారి..
ఉమ్మడి ఆదిలాబాద్‌ను నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయి జనగణన ఇదే. ప్రతీ జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూ పొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమై న సమాచారం అందనుంది.


