నిర్మల్ రూరల్/నిర్మల్‌చైన్‌గేట్/నిర్మల్ టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు గంట ముందుగానే తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా అనుమతించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులుతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. తొలి రోజు తెలుగు పరీక్ష జరిగింది. మొత్తం 9,747 మంది విద్యార్థులకు 9741 (99.93%) హాజరయ్యారు. ఆరుగురు గైర్హాజరయ్యారు. ప్రైవేట్‌గా ఒక విద్యార్థి పరీక్ష రాశాడు.
పరీక్ష కేంద్రాల తనిఖీ....
పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, డీఈవో భోజన్న వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని, మాస్ కాపీయింగ్ ప్రోత్సహించవద్దని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ సోమవార్‌పేటలోని బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో పరిశీలించారు. బెంచీలు, లైటింగ్, తాగునీరు సౌకర్యం గురించి తెలుసుకున్నారు. పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈవో భోజన్న ఉన్నారు. ఇక ఎస్పీ మేధా మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలులో ఉన్నందున అనవసరంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ సాయికిరణ్, ఇన్‌స్పెక్టర్లు కృష్ణ, సమ్మయ్య, ఎస్సై లింబాద్రి ఉన్నారు. డీఈవో జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, కాస్బా ఉన్నత పాఠశాల, ఈద్గాం ఉన్నత పాఠశాల, జుమ్మేరాత్‌పేట్ ఉన్నత పాఠశాల, మేధా మోడల్ స్కూల్, రవి హైస్కూల్, వశిష్ఠ, చాణక్య, ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. హిందీ బుధవారం జరుగుతుంది.


