నిర్మల్‌చైన్‌గేట్:జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, మండలస్థాయి అధికారులు ప్రజల ఆందోళనలు తొలగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌తో కలిసి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, పలు రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో సరిపడినన్ని ఎల్‌పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నా రు. గృహావసరాల సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఆయా పౌర సేవల ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చేయొద్దని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు.
గ్యాస్ ఏజెన్సీల తనిఖీ
కలెక్టర్ ఆదేశాలతో గ్యాస్ ఏజెన్సీలను తహసీల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో స్టాక్, అమ్మకానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. సిలిండర్ల కృత్రిమ కొరత సష్టించొద్దని నిర్వాహకులను ఆదేశించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో అమ్మినా, పక్కదారి పట్టించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
భైంసాలో తనిఖీ..
భైంసాటౌన్: పట్టణంలోని కృప గ్యాస్ ఏజెన్సీని డీసీఎస్‌వో రాజేందర్ శనివారం తనిఖీ చేశారు. సిలిండర్ నిల్వలు, బుకింగ్స్, డెలివరీ, తదితర వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ కొరత ఉందన్న ఆందోళనతో ఎక్కువగా బుకింగ్ చేసుకుంటున్నారని, దీంతో సర్వర్ స్లో అవుతోందన్నారు. ఈ సమస్య కూడా రెండురోజుల్లో పరిష్కారమవుతుందని తెలిపా రు. ఆయన వెంట భైంసా తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ప్రకాశ్ రాథోడ్ ఉన్నారు.
గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసిన ఏఎస్పీ
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీలను ఏఎస్పీ సాయికిరణ్ తనిఖీ చేశారు. వినియోగదారులకు సరైన సేవలు అందుతున్నాయా.. గ్యాస్ సిలిండర్ల నిల్వ విధానం, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. ఏజెన్సీల వద్ద ఉన్న రికార్డులు, స్టాక్ వివరాలు, డెలివరీ విధానం పరిశీలించారు. భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని ఏజెన్సీ యజమానులకు సూచించారు. అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


