న్యూస్‌రీల్
ప్యానిక్ బుకింగ్స్ కారణంగా కొరత అయోమయంలో వినియోగదారులు ఏజెన్సీలు, గోదాముల ఎదుట క్యూ అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్ల నిల్వ స్వాధీనం చేసుకుంటున్న అధికారులు
టీకాలతో జీవాలకు రక్ష
పాడిపశువుల్లో గాలికుంటు నివారణకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఊరూరా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. టీకాలు వేసి వాటితో కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నారు.
అడిషనల్ డీజీపీని కలిసిన కలెక్టర్
నిర్మల్‌చైన్‌గేట్: శుక్రవారం జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ (బెటాలియన్) సంజయ్‌కుమార్ జైన్‌ను పట్టణంలోని అటవీశాఖ వసతిగృహంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందించారు. అడిషనల్ డీజీపీని కలిసినవారిలో ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే ఉన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్/భైంసాటౌన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వంటగ్యాస్‌పై పడింది. వంటగ్యాస్‌కు కొరత ఏర్పడనుందని ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చ ర్యలు చేపట్టింది. అయినా ఫలితం లేకుండా పో తోంది. గృహ వినియోగ గ్యాస్‌కు కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినా భయంతో వినియోగదారులు భారీగా ముందస్తు బుకింగ్‌కు యత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు ‘ప్యానిక్ బుకింగ్’ పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ప్రభావం ఐవీఆర్‌ఎస్ (ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) బుకింగ్స్ మీద పడి సర్వర్ స్తంభించిపోతోంది. ప్యానిక్ బుకింగ్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ సర్వర్‌ను స్లో డౌన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా అంగీకరిస్తున్నాయి.
నిబంధనలు కఠినతరం
గ్యాస్ బుకింగ్ విషయంలో ప్రభుత్వం పరిమితులు విధించింది. సింగిల్ సిలిండర్‌కు 21 రోజులు, డబుల్ సిలిండర్‌కు 30 రోజులు వేచి చూడాలి. 21రోజుల తర్వాత సిలిండర్ బుక్ చేస్తే.. రెండున్నర రోజుల్లో డెలివరీ చేసేలా తాజాగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే, ఇప్పటిదాకా బుకింగ్ చేయగానే సిలిండర్ ఇస్తున్నారు. ఇక ముందుమాత్రం కచ్చితమైన గడువు పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయిల్ కంపెనీల జిల్లా కో–ఆర్డినేటర్ల నుంచి డీలర్ల వరకు ఆదేశాలు జారీచేశారు. దీనిపై కో ఆర్డినేటర్లను ‘సాక్షి’ సంప్రదించగా, గృహ విని యోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని చెబుతున్నా రు. జిల్లా వ్యాప్తంగా ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలన్నింటి పరిధిలో 1,39,430 ఎల్‌పీ జీ డొమెస్టిక్ కనెక్షన్లుండగా, వినియోగదారులకు ప్ర స్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంటున్నారు.
అక్రమ నిల్వలపై దాడులు
గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా నిల్వచేసిన వారిపై పౌర సరఫరాలశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లోని పలు హోటళ్లలో బుధ, శుక్రవారాలు తనిఖీలు చేశారు. 16 హోటళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 29 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని హోటళ్లలోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు.
భైంసాటౌన్: భైంసాలోని గ్యాస్ ఏజెన్సీ ఎదుట బారులుతీరిన వినియోగదారులు
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు 16
మొత్తం కనెక్షన్లు 2,51,785
జనరల్ కనెక్షన్లు 1,39,430
దీపం కనెక్షన్లు 47,215
ఉజ్వల కనెక్షన్లు 37,249
సీఎస్‌ఆర్ కనెక్షన్లు 26,828
భైంసాలోని ఓ ఏజెన్సీకి రోజుకు రెండు లోడ్లు (684 సిలిండర్లు) వస్తుండగా, ప్రస్తుతం రెండురోజులకో లోడ్ వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో గ్యాస్ కొరత ఉందన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అధికారులు గ్యాస్ నిల్వల సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూ, బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా ఏజెన్సీలను అప్రమత్తం చేయాల్సిన అవసరముంది. కాగా, ఇదివరకు వినియోగదారులు ఐవీఆర్‌ఎస్ నంబర్‌కు ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేసుకుంటే డెలివరీ చేసేవారు. ప్రస్తుతం ఒకేసారి అధికసంఖ్యలో వినియోగదారులు బుక్ చేస్తుండడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగి సకాలంలో బుకింగ్ కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఏజెన్సీల నిర్వాహకులే వారి వద్దకు వచ్చి ఫోన్‌లో వెంటనే గ్యాస్ బుక్ చేసి డీఏసీ ఆధారంగా అక్కడే డెలివరీ చేసేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్ల వాహనాలు వెళ్లడం లేదు. దీంతో వారు గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్ద క్యూ కడుతున్నారు.


