మళ్లీ..‘క్లాస్‌’ తీసుకోవాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ..‘క్లాస్‌’ తీసుకోవాల్సిందే!

Mar 13 2026 7:39 AM | Updated on Mar 13 2026 7:39 AM

సమయానికి బడికిరాని సార్లు స్కూళ్లల్లో ‘టీచక’ చేష్టలు నిధుల వినియోగంలో చేతివాటం సంఘాల పేరిట డ్యూటీకి ఎగనామం

నిర్మల్‌: జిల్లాలో కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ దారితప్పుతున్నారు. గతేడాది ఘటనలను మర్చిపోయారు. ఈ విద్యాసంవత్సరం మొదట్లో జిల్లా ఉన్నతాధికారులు, న్యాయనిపుణులు తీసుకున్న ప్రత్యేక ‘క్లాస్‌’లనూ విసర్మించారు. మళ్లీ కీచక చేష్టలతో, నిధుల దుర్వినియోగంతో, విధులకు ఎగనామంతో విద్యాశాఖను భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

‘క్లాస్‌’లు చెప్పినా..

పోక్సోవంటి కేసుల్లో ఉపాధ్యాయులు అరెస్టులు కావడం, ఆర్థిక నేరాల వంటి ఘటనల్లో పాల్గొనడంతో విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ‘ప్రత్యేక తరగతులు’ నిర్వహించారు. జిల్లా జడ్జీలు, ఉన్నతాధికారులు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. వారు నిర్వహించాల్సిన గురుతర బాధ్యతలను మరోసారి గుర్తుచేశారు. కానీ.. ఇందులో కొంతమంది వాటన్నింటినీ మర్చిపోయారు.

దుర్వినియోగం.. దుష్టచేష్టలు..

పాఠశాలల్లో టాయిలెట్లు, ఇతర మరమ్మతులకు ప్రభుత్వాలు నిధులను ఇస్తున్నాయి. వీటిని బడుల్లో ఖర్చు చేయకుండా కొంతమంది పెద్దసార్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. నిర్మల్‌రూరల్‌ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి అవినీతిపై సదరు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్‌ను సస్పెన్షన్‌ చేశారు. అలాగే పిల్లలపై ఉపాధ్యాయుడి దుష్టచేష్టలపైనా ఫిర్యాదులు వచ్చాయి. పలు మండలాల్లోనూ ఇలాగే నిధుల దుర్వినియోగం, ఉపాధ్యాయుల తీరుపైన ఆరోపణలు ఉన్నాయి. లైవ్‌లొకేషన్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ సిస్టం ఉన్నా.. సమయానికి, అలాగే మొత్తానికే బడికి రాని టీచర్లూ ఉన్నారు. ఇక కొంతమంది టీచర్లు ఉపాధ్యాయ సంఘాల పేరు చెప్పి, తమ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలకు ఉన్న గైడ్‌లైన్స్‌ దాటి ప్రవర్తిస్తున్న తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదులు ఉన్నాయి.

పాత చేష్టలు..

గత రెండు విద్యాసంవత్సరాలు జిల్లా విద్యాశాఖకు ఎన్నడూ లేనంత చెడ్డపేరును మూటగట్టాయి. యూబిట్‌ పేరిట చేసిన ‘కాయిన్‌దందా’ ఎంతోమంది ఉపాధ్యాయులను ఆ ఊబిలో దింపింది. తరగతులు చెప్పకుండా కాసులు కురిపిస్తున్నాయంటూ ఈదందాలోనే చాలామంది ఉపాధ్యాయులు బిజీగా మారారు. చివరకు కొంతమంది టీచర్లు ఏకంగా జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఇక అమ్మానాన్నల తర్వాత ఆ స్థానంలో ఉండి చిన్నారులకు విద్యాబుద్ధులను నేర్పాల్సింది గురువులే. కొంతమంది మాత్రం కీచకచేష్టలతో భ్రష్టుపట్టించారు. ఈ ఘటనలు సదరు ఉపాధ్యాయుల అరెస్టులు, సస్పెన్షన్ల వరకూ వెళ్లింది. ఇవన్నీ మర్చిపోకముందే.. మళ్లీ జిల్లాలో పాతచేష్టలు పునరావృతం అవుతుండటం కలవరపెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement