బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో పదో బెటాలి యన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించాలో విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. కమాండర్ మన్మోహన్ యాదవ్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. తన బృందంతో కలిసి వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాలు (భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు) ఎదురైనప్పుడు అనుసరించాల్సిన రక్షణ పద్ధతులను ప్రత్యక్షంగా చేసి చూపారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించే తీరు. ప్రథమ చికిత్స అందించే విధానం. అందుబాటులో ఉన్న వనరులతో ప్రాణాలను కాపాడుకోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం చేసిన ప్రదర్శనను ప్రశంసించారు. విద్యార్థులు చదువుతోపాటు విపత్తు నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు డాక్టర్ ఎస్.విఠల్, శీలం శేఖర్, డాక్టర్ బి.శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.


