నీడలేని ఉపాధి | - | Sakshi
Sakshi News home page

నీడలేని ఉపాధి

Mar 13 2026 7:39 AM | Updated on Mar 13 2026 7:39 AM

మెడికల్‌ కిట్‌ జాడలేదు.. తాగు నీటి వసతి అంతంతే ఏళ్లుగా అందని పరికరాలు ఇబ్బంది పడుతున్న కూలీలు

లోకేశ్వరం: గ్రామాల్లో వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బీవీజీ రామ్‌జీ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) అమలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో విస్తృతంగా పనులు కల్పిస్తున్నప్పటికీ, కూలీలకు తగిన వసతులు కల్పించడం లేదు. పని స్థలాల్లో నిలువ నీడ ఉండడం లేదు. తాగునీటి వసతి అంతంత మాత్రమే,

పదేళ్లనాటి పనిముట్లే..

పదేళ్ల క్రితం ఉపాధి కూలీలకు పనిముట్లు, టెంట్లు పంపిణీ చేశారు. గ్రూపులో నలుగురు సభ్యులకు కలిపి నాలుగు గుంతలు తవ్వేందుకు గడ్డపారలు అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పనిముట్లు ఇవ్వలేదు. దీంతో పదేళ్ల నాటి పనిముట్లనే వాడుతున్నారు. కొందరు కూలీలు సొంత ఖర్చుతో కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.

కానరాని మెడికల్‌ కిట్లు..

పనిస్థలాల్లో ప్రమాదాల సమయంలో ప్రాథమిక చికిత్సకు మెడికల్‌ కిట్లు ఏర్పాటు చేయాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఇవి అందుబాటులో లేవు. గాయపడిన కూలీలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రైవేటు ఆసుపత్రులకు పరిగెత్తాల్సి వస్తోంది. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం లేదు.

చెట్ల కింద సేద..

పెరుగుతున్న ఎండ వేడితో ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి రావడం కష్టమవుతోంది. రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు నాలుగు గంటల పని చేస్తున్నారు. పనులు ముగిసిన తర్వాత ఆన్‌లైన్‌లో హాజరు పూర్తిచేస్తారు. చెట్లు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే సేద తీరుస్తున్నారు. ఇక వేసవిలో ఎక్కువ నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ కూలీలు ఇంటి నుంచి బాటిల్స్‌లో నీళ్లు తీసుకెళ్తున్నారు. ఎండలకు అవి వేడెక్కుతున్నాయి.

హాజరు పెరిగినా..

జిల్లాలో 1.74 లక్షల జాబ్‌ కార్డులు, 3.20 లక్షల కూలీలు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 35 వేల మందికిపైగా హాజరవుతున్నారు. అర్హులకు పనులు కల్పిస్తున్నారు కానీ, వసతులు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

అదనపు భత్యం బంద్‌..

ఉపాధి కూలీలు వేసవిలో భూమి గట్టిగా ఉండడం, పొద్దస్తామనం పని చేయలేని పరిస్థితి ఉండంలో అదనపు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మార్చిలో 20 శాతం, ఏప్రిల్‌లో 25 శాతం, మేలో 30 శాతం అదనపు భత్యం చెల్లించేవారు. నాలుగేళ్లుగా ఈ అదనపు కూలి చెల్లించడం లేదు. గతంలో రాగాస్‌ సాప్ట్‌వేర్‌ ద్వారా నమోదు చేసే సందర్భాల్లో అదనపు చెల్లింపులు నమోదుకు అవకాశం ఉండే. ప్రస్తుతం ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌) సాప్ట్‌వేర్‌ వాడుతుండడం, కేంద్రం నేరుగా ఈ సాప్ట్‌వేర్‌ రూపొందించి వినియోగిస్తుండడంతో అదనపు కూలి చెల్లింపు నమోదుకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం జిల్లాలో డైవెర్షన్‌ డ్రైన్‌, రాళ్లకట్టలు, ఫీడర్‌ చానేల్‌, ఎంఐ ట్యాంకు, పశువుల పాకలు, కోళ్ల ఫారాల నిర్మాణం, చెక్‌డ్యాం, ఫామ్‌పాండ్‌, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, పార్మేషన్‌ రోడ్డు పనులు కొసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement