నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాప్రతినిధులు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై అవగాహన పెంచుకుని అందులో భాగస్వాములవుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో ఇటీవల ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం శాఖల వారీగా సర్పంచులు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు.
చట్టాలపై అవగాహన ఉండాలి..
అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులందరికీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల అనారోగ్య సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అందుబాటులో ఉండాలి
ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కరించే విధంగా అధికారులతో కలిసి కృషి చేయాలన్నారు. అధికారులు పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ 99 రోజుల ప్రణాళికలో భాగంగా పుష్కరించాలన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
ప్రజాసంక్షేమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం యువత ఉన్నారని, వీరంతా ఉత్సాహంగా ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేయాలన్నారు.
సర్పంచులదే ముఖ్యపాత్ర
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తనులుగా వ్యవహరించాలన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో పరిపాలన జ్ఞానం పెరుగుతుందన్నారు.
పలువురికి సన్మానం..
అనంతరం పెంబి ఆస్పిరేషన్ బ్లాక్‌ను అభివృద్ధి పథంలో నడిపిన ప్రజాప్రతినిధులను సన్మానించారు. సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందించి, సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ అప్పాల కావ్య, అప్పాల గణేశ్‌చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ దత్తాత్రి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, డీఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీ రాధిక, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఆస్పిరేషన్‌బ్లాక్ అవార్డు పొందిన పెంబి మండల ప్రజాప్రతిధులతో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యేలు
హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు


