‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 11 2026 8:29 AM | Updated on Mar 11 2026 8:29 AM

● హాజరు కానున్న 9,750 మంది విద్యార్థులు ● జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు ● ‘సాక్షి’తో డీఈవో భోజన్న

లక్ష్మణచాంద: మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాధికారి భోజన్న తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ సంద్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.

సాక్షి: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయా?

డీఈవో: మరో మూడురోజుల్లో ప్రారంభం కా నున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం.

సాక్షి: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు?

డీఈవో: విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగు నీటి వసతితోపాటు, విద్యార్థులకు సరిపడా బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించాం. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం.

సాక్షి: వేసవి దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

డీఈవో: వేసవి దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల కు మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచుతాం. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి.

సాక్షి: పరీక్ష కేంద్రాల్లోకి ఎప్పుడు అనుమతి ఇస్తారు?

డీఈవో: పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రంకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభం అయిన తరువాత 5 నిమిషాల వరకు అనుమతిస్తాం. నిమిషం నిబంధన లేదు.

సాక్షి: జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదని హాల్‌ టికెటు ఇవ్వడం లేదు. అటువంటి వారిపై ఏం చర్యలు తీసుకుంటారు?

డీఈవో: ఇప్పటి వరకు తమకు విద్యార్థులు ఎవరూ హాల్‌ టికెట్‌ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయలేదు. ఆన్‌లైన్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించాం. హాల్‌ టికెట్లపై ప్రధానోపాధ్యాయుల సంతకం లేకున్నా పరీక్షకు అనుమతిస్తారు.

సాక్షి: జిల్లాలో ఎంత మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు?

డీఈవో: జిల్లాలో మొత్తం 9,750 మంది విద్యార్థులు పది వార్షిక పరీక్షకు హాజరు కానున్నారు. ఇందులో 4,786 బాలురు, 4,964 బాలికలు ఉన్నారు.

సాక్షి: ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు?

డీఈవో: జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. 535 ఇన్విజిలేటర్లు, 47 మంది సీఎస్‌లు, 47 మంది డీవోలు, 13 మంది అడిషనల్‌ డీవోలను నియమించాం. ఏడుగురు సెంటర్‌ కస్టోడియన్స్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు 47, ఫ్లయింగ్‌ టీంలు 3 ఏర్పాటు చేశాం.

సాక్షి: సందేహాలు ఎలా నివృత్తి చేసుకోవాలి?

డీఈవో: విద్యార్థుల సందేహాల నివృత్తికి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఉంటే 9059987730 నంబర్‌కు ఫోన్‌ చేసి పరిష్కరించుకోవాలి. సందేహాలు నివృత్తి చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement