అనర్హుల రేషన్‌ కట్‌! | - | Sakshi
Sakshi News home page

అనర్హుల రేషన్‌ కట్‌!

Mar 11 2026 8:29 AM | Updated on Mar 11 2026 8:29 AM

● ఏరివేతకు ప్రభుత్వం చర్యలు ● జిల్లాలో అనర్హుల వద్ద 3,430 కార్డులు ● జిల్లా అధికారులకు చేరిన జాబితా

జిల్లాలో ఇలా...

సన్న బియ్యం అర్హులకు మాత్రమే అందాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అనుమానిత రేషన్‌ కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. అనుమానిత కార్డుల జాబితా అందినా.. ఇంకా ఎలాంటి తొలగింపు ప్రక్రియ ప్రారంభించలేదు. జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 582 రేషన్‌ దుకాణాల ద్వారా 4381 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. 2,47,671 రేషన్‌ కార్డులు ఉండగా.. 7,69,049 మందికి లబ్ధి చేకూరుతోంది. అయితే, వీరిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినవారు, 4 ఎకరాలకుపైబడి వ్యవసాయ భూమి ఉన్నవారు, అధిక వార్షికాదాయం ఉన్న వారు, రెండు రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్న వారిని గుర్తించి 3,430 అనుమానిత కార్డుల జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి

తొలగించనున్నారు.

భైంసాటౌన్‌: తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అనర్హుల రేషన్‌కార్డులు తొలగించనుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా అనుమానిత కార్డుల జాబితాను రూపొందించింది. 3,430 అనుమానిత రేషన్‌కార్డులు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులకు జాబితా పంపింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అనర్హులుగా తేలితే వాటిని తొలగించాల్సి ఉంది. అయితే, అనుమానిత రేషన్‌కార్డుల తొలగింపునకు సంబంధించి మార్గదర్శకాలు రాలేదని సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వారు, నాలుగెకరాలకుపైబడి వ్యవసాయ భూమి ఉన్నవారు, అత్యధిక వార్షిక ఆదాయం, రెండు రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారిని అనర్హులుగా గుర్తించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

పక్కదారికి కట్టడి..

పేదలకు చౌకధరలకే బియ్యం అందించేందుకు ప్రభుత్వాలు తెల్ల రేషన్‌కార్డులు మంజూరు చేస్తుంది. అయితే, పలు ప్రభుత్వ పథకాలకు తెల్లరేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో, పేదలే కాకుండా ధనికవర్గాలు సైతం తెల్ల రేషన్‌కార్డులు పొందారు. దీంతో ఇలాంటివారు రేషన్‌షాపుల్లో బియ్యం తీసుకుని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. గతంలో దొడ్డుబియ్యం ఉండడంతో విక్రయించుకునేవారు. ప్రస్తుతం సన్నబియ్యం అందిస్తుండడంతో బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం అనర్హుల కార్డుల తొలగింపు చేపట్టింది. అంతేగాక, గతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉండి రేషన్‌కార్డు పొందినవారిలో తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందడం, ఆదాయం పెరిగినా రేషన్‌కార్డు కలిగి ఉన్నవారున్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు రేషన్‌కార్డులో ఉండటంతో వారి పేరుతో ప్రభుత్వం నుంచి బియ్యం అలాట్‌ అవుతోంది. దీంతో కేటాయించిన బియ్యం పక్కదారి పడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అనర్హుల తొలగింపు ప్రక్రియతో బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ తగ్గనుంది.

జాబితా అందింది...

రాష్ట్ర ప్రభుత్వం అనుమానిత రేషన్‌కార్డుల జాబితాను పంపింది. జిల్లాలో మొత్తం 3,430 కార్డులు ఉన్నట్టు జాబితా వచ్చింది. తొలగింపునకు సంబంధించి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – రాజేందర్‌, డీసీఎస్‌వో, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement