పిప్రి లిఫ్ట్‌కు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

పిప్రి లిఫ్ట్‌కు మహర్దశ

Mar 11 2026 8:29 AM | Updated on Mar 11 2026 8:29 AM

● రూ.77 కోట్లు మంజూరు ● ప్రభుత్వ జీవో విడుదల ● ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ కృషితో సాధ్యం ● లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలకు సాగునీటి ఆశలు

భైంసా: ముధోల్‌ నియోజకవర్గంలోని పిప్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. దీంతో లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందే మార్గం సుగమం కానుంది. ఈ నిర్ణయంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ముధోల్‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు, చెరువుల మరమ్మతులు చేపట్టాలని ఆయన పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. హైదరాబాద్‌కు వెళ్లిన ప్రతీసారి సంబంధిత మంత్రులను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ముఖ్యంగా పిప్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కోసం ఎమ్మెల్యే ప్రత్యేకంగా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని పలుమార్లు కలిసి ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే నిరంతర కృషికి స్పందించిన ప్రభుత్వం తాజాగా రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. పిప్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తయితే లోకేశ్వరం మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రస్తుతం వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. పంటల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పిప్రి లిఫ్ట్‌కు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముధోల్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందేలా కృషి కొనసాగిస్తామని తెలిపారు. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఇన్‌చార్జి మంత్రికి ఎమ్మెల్యే పవార్‌ రామరావు పటేల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement