నిర్మల్‌చైన్‌గేట్: ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమష్టి కృషితో పెంబి ప్రగతి సాధ్యమైందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా, సోమవారం జరిగిన నీతి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాకు కార్యక్రమం కింద పెంబి మండలంలో చేపట్టిన విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చేసిన కృషి, తద్వారా సాధించిన ప్రగతి వివరాలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పెంబి అభివృద్ధిలో ఎదురైన సవాళ్లు, చేపట్టి చర్యలు వెల్లడించారు. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, మహిళలు, గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాల నివారణ, రోగాల నిర్ధారణ, నివారణ, భూసార పరీక్షల నిర్వహణ, అక్షరాస్యత, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, మౌలిక సదుపాయాల మెరుగు తదితర అంశాల్లో అద్భుత ప్రగతి సాధించినట్లు వివరించారు. పెంబి బ్లాకు విజయ ఖ్యాతి మరోసారి చాటిచెప్పేందుకు ఈ నీతి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ వేదికయ్యిందన్నారు.


