పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైదరాబాద్ నుంచి ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల ఏర్పాట్లపై జిల్లాలవారీగా కలెక్టర్లను వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలను లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్మీడియట్‌కు సంబంధించి 6,652 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 6,473 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. మార్చి 14 నుండి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు 47 పరీక్ష కేంద్రాల్లో 9,758 మంది విద్యార్థులు రాయనున్నట్లు తెలిపారు. సీఎస్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద, పరీక్ష పత్రాల తరలింపు సమయంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యార్థులకు సౌకర్యవంతమైన బెంచీలు, సరైన లైటింగ్, సిబ్బందితో కూడిన వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పరీక్షల సమయాలకు అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జీరాక్స్ దుకాణాలు మూసివేసి, బీఎన్‌ఎస్ సెక్షన్ 163 (సీఆర్పీసీ 144) అమలు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీఐఈవో పరుశురాం, డీపీవో శ్రీనివాస్, ఖజానా శాఖ అధికారి సరోజ, డీఎంహెచ్‌వో రాజేందర్, రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


