
ప్రజావాణి.. పరిష్కారం కాదేమి?
వచ్చిన దరఖాస్తులే మళ్లీ మళ్లీ.. ఇందిరమ్మ ఇళ్లు, భూసమస్యలే అధికం వినతులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి వందకుపైగా దరఖాస్తులు వస్తున్నాయి. వాటిలో పది, ఇరవై మాత్రమే పరిష్కారం అవుతున్నాయి. మిగతావి పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో బాధితులు సమస్యపై పదేపదే కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. భూమి ఆక్రమణలు, దివ్యాంగుల పెన్షన్ ఆలస్యం, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, పట్టా పాస్‌బుక్‌లో లోపాలు వంటి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 105 దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పరిష్కారం కాని దరఖాస్తుల విషయంలో బాధితులకు స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, ఏవో సూర్యారావు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
వనమహోత్సవం త్వరగా పూర్తి చేయాలి..
ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్, వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నాటిన మొక్కల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు.
మట్టి గణపతులను పూజిద్దాం..
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులతో కలిసి మట్టి గణపతుల పూజను ప్రోత్సహించే పోస్టర్ విడుదల చేశారు.

ప్రజావాణి.. పరిష్కారం కాదేమి?