
‘ఉపకార’ంతో ఊతం
నిర్మల్ చైన్‌గేట్: ప్రభుత్వ బడుల్లో విద్యనభ్యసించే పేదవిద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపాలనుకునేవారికి ఉపకార వేతనాలు అందిస్తూ ఆసరాగా నిలుస్తోంది. ఇందుకోసం 2008లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్)ను అమలులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పరీక్ష నిర్వహించి అర్హత సాధించినవారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ పూర్తి చేసేదాకా నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.12వేల చొప్పున స్కాలర్‌షిప్ మంజూరు చే యనుంది. ఎంపికై న విద్యార్థులు ప్రతీ సంవత్సరం ఉపకార వేతనం కోసం వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్ డబ్బులు నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.
నవంబర్‌లో ప్రతిభ పరీక్ష
ఈ నెల 31వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలని విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆ దేశాలు జారీ చేశారు. జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. అయితే.. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు ఉపాధ్యాయులే ఫీజు చెల్లించి పోటీ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ ఏడాది నవంబర్‌లో ప్రతిభ పరీక్ష నిర్వహిస్తారు.
ఎంపిక విధానం ఇలా..
కేంద్ర విద్యాశాఖ ఏటా ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రధానంగా మెంటల్ ఎబిలిటీ 30మార్కులు, మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. స్కాలస్టిక్ ఎబిలిటీ పరీక్ష 90 మార్కులు, 7వ, 8వ తరగతుల సైన్స్, గణితం, సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలుంటాయి. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు. ముఖ్యంగా జిల్లా యూనిట్‌గా, కేటగిరీల వారీగా, ప్రతిభ కొలమానంగా అర్హుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు అర్హతలు
ఉపకార వేతనానికి అర్హత సాధించేందుకు ప్రతిభ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఏడో తరగతిలో కనీసం 55శాతం మార్కులు సాధించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5శాతం మార్కుల సడలింపు ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించి ఉండకూడదు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఫాం జిరాక్స్ కాపీతోపాటు ఏడోతరగతిలో పాందిన మార్కుల జాబితా, ఆదాయ, కుల ధ్రువీకరణ జిరాక్స్ పత్రాలను ఈనెల 31న డీఈవో కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
గడువులోపు దరఖాస్తు చేసుకుని ప్రతిభ పరీక్ష రాస్తే మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. స్కాలర్‌షిప్‌నకు ఎంపికై తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యేదాకా నాలుగేళ్లపాటు రూ.12వేల చొప్పున ఉపకార వేతనం అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– పరమేశ్వర్, ఇన్‌చార్జి డీఈవో

‘ఉపకార’ంతో ఊతం