
సూపర్ బ్రెయిన్ యోగా
బాసర : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుంజీళ్ల జాతీయ ప్రచారకులు అందె జీవన్‌రావు ఆధ్వర్యంలో ‘సూపర్ బ్రెయిన్ యోగా’పై కార్యశాల సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 14 రౌండ్లు ఈ యోగాను ఆచరించారు. అందె జీవన్‌రావు మాట్లాడుతూ, గుంజీళ్లను శిక్షగా భావించడం దురదృష్టకరమన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇది ‘సూపర్ బ్రెయిన్ యోగా’గా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. ఈ యోగా మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సృజనాత్మకత, మానసిక సమతుల్యతను పెంపొందిస్తుందని, రోజూ ఆచరిస్తే విద్యార్థులు అధిక మార్కులు సాధించవచ్చని పవర్ పాయింట్ ద్వారా వివరించారు. పర్యావరణ కాలుష్యం, ఎలక్ట్రానిక్ రేడియేషన్, మానసిక ఒత్తిడి వల్ల పీనియల్ గ్రంథి పనితీరు దెబ్బతింటుందని, దీనివల్ల మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి జీవ గడియారం గాడితప్పుతుందని ఆయన హెచ్చరించారు. సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలల్లో ప్రార్థన సమయంలో చేర్చడం ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, ఉపాధ్యాయులు సురేష్, నరేందర్, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.