
కలెక్టరేట్‌కు డబుల్ బెడ్‌రూం ఇళ్ల బాధితులు
ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లను అనర్హులకు కేటాయించి అర్హులకు అన్యాయం చేశారని సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సునారికారి రాజేశ్, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి పీటర్, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకన్న అన్నారు. బాధిత నిరుపేదలతో కలిసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు పలు వాహనాల్లో తరలివెళ్లారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించిన నాటి నుంచి విచారణ చేస్తామని అధికారులు అనర్హులను తొలగించకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో కేటాయించిన వారిని తొలగించి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, బాధితులు తోట రాధ, గౌస్, పద్మ, సునీత, జావిద్, గీత, సురేశ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.