
ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ పవర్
● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి, ఫైనాన్స్, ప్లానింగ్, ఎనర్జీ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాల వారీగా ప్రభుత్వ భవనాల వివరాలు, నెలవారీ విద్యుత్ వినియోగం, బిల్లులను వారంలోగా సమర్పించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర శాఖ భవనాలపై కూడా సౌర ఫలకాలు అమర్చనున్నట్టు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, టీజీ రెడ్‌కో ఎండీ ఎల్.శ్రీనివాస్, ఏపీడీ నాగవర్ధన్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రభాకర్ పాల్గొన్నారు.