
ఫీజు కట్టినా.. రెగ్యులరైజ్ కాలే!
● లబ్ధిదారులకు అందని ప్రొసీడింగ్స్ ● యాజమాన్య హక్కుల కోసం తప్పని నిరీక్షణ ● 6,841 మంది ఫీజు చెల్లిస్తే 2,460 మందికే ప్రొసీడింగ్స్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో లే–అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారు యాజమాన్య హక్కుల కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి, నిర్దేశిత ఫీజులు చెల్లించినా ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం కారణంగా దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ పథకం ఇలా..
గతంలో అనుమతి లేకుండా లే–అవుట్‌లు ఏర్పాటు చేసి వెంచర్లు నిర్మించినవారు చాలామంది ఉన్నారు. ఈ విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసిన యజమానులకు ఊరట కల్పించేందుకు, గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2020లో మున్సిపల్ శాఖ జీవో 131 జారీ చేస్తూ, ఆగస్టు 26, 2020కి ముందు స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో స్థల క్రమబద్ధీకరణ కోసం రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించారు.
మూడు దశల్లో పరిశీలన..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించేలా అధికారులు నిర్ణయించారు.
● స్టేజ్–1: అర్బన్ ఏరియాల్లో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలిస్తారు. రెవెన్యూ అధికారులు స్థల వివరాలను, నీటిపారుదల శాఖ అధికారులు శిఖం భూముల్లో ఏమైనా ఉన్నాయా అని తనిఖీ చేశారు.
● స్టేజ్–2: టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ కంటే ఉన్నతస్థాయి అధికారి దరఖాస్తుతో జతచేసిన పత్రాలను పరిశీలిస్తారు. ప్లాట్‌లలో ఇల్లు నిర్మించినట్లయితే, సంబంధిత పట్టా అందజేయాల్సి ఉంటే దాని గురించి సమాచారం ఇస్తారు.
● స్టేజ్–3: మున్సిపల్ కమిషనర్ దరఖాస్తులు, పత్రాలను మరోసారి సమీక్షించి, నిర్దేశిత ఫీజును చలానా రూపంలో చెల్లించాలని దరఖాస్తుదారులకు సూచిస్తారు.
రూ.15.20 కోట్ల ఆదాయం..
అన్నీ సక్రమంగా ఉన్నవారికి ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా ప్రభుత్వం ఫీజులోనూ రాయితీ కల్పించింది. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలు, 18 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 44,602 దరఖాస్తులు స్వీకరించగా, వీటిలో 37,939 దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించినట్లు నిర్ధారించారు. ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిన నేపథ్యంలో, 6,841 మంది ఫీజులు చెల్లించారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి జిల్లా నుంచి సుమారు రూ.15.20 కోట్ల ఆదాయం సమకూరింది.
ప్రొసీడింగ్స్ కోసం నిరీక్షణ..
ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఐదేళ్లుగా ప్రక్రియ పూర్తి కాకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినప్పటికీ, నెలలు గడుస్తున్నా 6,841 మంది ఫీజు చెల్లించినవారిలో కేవలం 2,460 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. సిబ్బంది కొరత, దరఖాస్తులను మరోసారి పరిశీలించాల్సిన అవసరం వంటి కారణాలతో ఈ ఆలస్యం జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి.
జిల్లాలోని మొత్తం దరఖాస్తులు 44,602
సమకూరిన ఆదాయం రూ.15.20కోట్లు
మూడు మున్సిపాలిటీలలో 26,537
ఫీజుకు అర్హత పొందిన వారు 21,850
ఫీజు చెల్లించినవారు 3,611
ఫీజు చెల్లించాల్సిన వారు 18,239
ప్రొసీడింగ్ అందినవారు 2,460
ప్రొసీడింగ్ అందాల్సినవారు 1,151
18 మండలాల పరిధిలో 18,065
ఫీజుకు అర్హత పొందిన వారు 16,089
ఫీజు చెల్లించినవారు 3,230
ఫీజు చెల్లించాల్సిన వారు 12,859