
ఉద్యమ దిశగా..
జిల్లాకేంద్రంలో 2009–10 విద్యాసంవత్సరంలో ఏర్పాటైన మహిళా డిగ్రీ కళాశాలను 2016–17లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు తరలించారు. ఈవిషయం చాలామంది పాలకులు, నాయకులు, విద్యావంతులకూ తెలియకపోవడం గమనార్హం. ఇదేవిషయాన్ని ఇటీవల జిల్లాలో ఉన్నతవిద్య తీరుపై వరుస కథనాల్లో భాగంగా ఈనెల 6న ‘ఉన్నతవిద్య..ఉత్తదే’ శీర్షికన ‘సాక్షి దినపత్రిక’ ప్రచురించింది. దీనిపై కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు. మహిళా డిగ్రీ కళాశాల తరలింపుపై స్థానిక ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరారు. ఈమేరకు ఆయన నిర్మల్ జిల్లాలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీకళాశాల ఏర్పాటు కావడం, అలాగే జిల్లాకో డిగ్రీకాలేజీ ఉండాలన్న నిబంధనలో భాగంగానే కాకతీయ యూనివర్సిటీ తరలింపు చేపట్టినట్లు వివరించారు.
నిర్మల్: జిల్లాలో యూనివర్సిటీ సాధన కోసం ఉద్యమదిశగా అడుగులు పడుతున్నాయి. ఉన్నతవిద్య జిల్లావాసులకు అందుబాటులో ఉండాలన్న అంశంపై ‘సాక్షి’ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం విద్యావంతులు, జిల్లావాసుల్లో కదలిక తీసుకువచ్చింది. విశ్వవిద్యాలయం కోసం సాధన సమితి పేరిట ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నిసంఘాలు, వర్గాలు సమష్టిగా సాధనోద్యమం సాగాలని నిర్ణయించారు.
‘వర్సిటీ’పై కదలిక..
‘ఇంకెన్నేళ్లు ఈ దుస్థితి.. మన ప్రాంతానికి విద్యావైభవం ఎప్పుడూ..!?’ అన్న ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇదేక్రమంలో ఇటీవల ‘సాక్షి’ జిల్లాలో ఉన్నతవిద్యపై నిర్లక్ష్యం, ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు అవశ్యకత అంశాలపై వరుస కథనాలను ప్రచురించింది. విద్యావంతులతో ‘రౌండ్‌టేబుల్ సమావేశం’ నిర్వహించింది. ఈ సమావేశం జిల్లాలో ఉన్నతవిద్య ఉన్నతీకరణ జరగాలన్న అంశాన్ని లేవనెత్తడంతో అన్నివర్గాల్లో కదలిక వచ్చింది.
సాధన సమితిగా..
చదువులతల్లి కొలువైన జిల్లాలో ‘జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన సమితి’ పేరిట విశ్వవిద్యాలయం సాధించేదాకా ఉద్యమించేందుకు జిల్లా సిద్ధమవుతోంది. ‘ఫైట్ ఫర్ రైట్..’ అంటూ విద్యావంతులు, విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు కలిసి ‘యూనివర్సిటీ సా ధన సమితి’ని రూపకల్పన చేశాయి. త్వరలో కార్యాచరణ ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నాయి.
కీలకంగా.. పీజీసెంటర్
జిల్లాలో యూనివర్సిటీ డిమాండ్‌లో ఇక్కడి కాకతీయ పీజీసెంటర్ కీలకంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ ఏర్పాటు చేసిన కొత్త వర్సిటీలలో గతంలో పీజీసెంటర్‌లుగా ఉన్నవే. తాజాగా జిల్లాలోనూ పురుడుపోసుకున్న విశ్వవిద్యాలయ సాధనోద్యమంలోనూ ఇదే కీలకం కానుంది. జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి వ్యవస్థాపకుడు నంగె శ్రీనివాస్ సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్లడంతో అప్పట్లోనే సానుకూల స్పందన వచ్చింది. తర్వాత మూలనపడినా.. ఇప్పుడు మళ్లీ యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ ఊపందుకుంది.
‘మహిళా డిగ్రీ’పై స్పందించిన కలెక్టర్
విశ్వవిద్యాలయం కోసం పోరాటం.. అన్నివర్గాలతో యూనివర్సిటీ సాధన సమితి.. జిల్లాలో చర్చనీయాంశంగా ‘సాక్షి’ డిబేట్ మహిళా డిగ్రీ కాలేజీపై స్పందించిన కలెక్టర్