
కూలీలకు ‘భరోసా’ ఏది?
● అమలుకాని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ● లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా అందని ఆర్థికసాయం ● వ్యవసాయ కూలీలకు తప్పని ఎదురుచూపు
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం తన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా భూమిలేని వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ సాయం రెండు విడతల్లో అందించేలా నిర్ణయించింది. జిల్లాలో ఈ పథకం అమలు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీని ఎంపిక చేసి, జనవరి 26న మంజూరు పత్రాలు అందజేశారు. ఈ 18 గ్రామాల్లో 688 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అయితే, రెండో విడత సాయం అందాల్సిన సమయం దాటినా, ఇప్పటి వరకు అందలేదు. మిగిలిన గ్రామాల లబ్ధిదారులకు ఈ సాయం ఎప్పుడు అందుతుందనే దానిపై అధికారుల నుంచి స్పష్టత లేదు.
లబ్ధిదారుల ఎంపిక..
ఈ పథకం కింద భూమిలేని, ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలు అర్హులుగా నిర్ణయించారు. జిల్లాలోని 396 గ్రామాల నుంచి 27,446 మంది లబ్ధిదారులను ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశారు. అయినా కేవలం 688 మందికి మాత్రమే మొదటి విడత సాయం అందడంతో మిగిలిన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు గ్రామాలకే సాయం పరిమితమైన నేపథ్యంలో, మిగిలిన లబ్ధిదారులకు ఎప్పుడు ఆర్థిక సాయం అందుతుందనే సమాచారం అధికారులు తెలుపడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులందరికీ ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ సాయం అందించాలని కోరుతున్నారు.
జిల్లా వివరాలు:
మొత్తం మండలాలు 18
గ్రామపంచాయతీలు 396
పైలెట్ ప్రాజెక్టులో లబ్ధి పొందినవారు 688
గ్రామసభకు పంపిన అర్హుల జాబితా 29,306
గ్రామసభలో అర్హత పొందిన వారు 27,446
గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు 6,871
అర్హత పొందిన వారు 1,242