
వృక్షాబంధన్ జరుపుకోవాలి
● డెప్యూటీ రేంజ్ అధికారి నజీర్‌ఖాన్
సారంగపూర్: నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా మనిద్దరం దేశానికి రక్ష అంటూ రక్షాబంధన్ పండుగను జరుపుకోవడంతోపాటు వృక్షాలను, అడవులను రక్షించుకునేందుకు వృక్షాబంధన్ పండుగను సైతం జరుపుకోవాలని డీఆర్‌వో నజీర్‌ఖాన్ అన్నారు. మండలంలోని అడెల్లి మహాపోచమ్మ నందనవనంలో స్థానిక ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ ఆధ్వర్యంలో విద్యార్థులు, అటవీశాఖ అధికారులు శనివారం వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు, అటవీఖ సిబ్బంది నందనవనంలో ఉన్న పెద్దపెద్ద మొక్కలకు, విద్యార్థులు, సిబ్బంది కలిసి నాటిన మొక్కలకు రాఖీలు కట్టారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నజీర్‌ఖాన్ మాట్లాడుతూ వృక్షాలను మనం రక్షిస్తే అవి మనకు ప్రాణవాయువును ఇచ్చి రక్షిస్తాయని అన్నారు. అందుకే ప్రతీవిద్యార్థి తమ తల్లిదండ్రులు, బంధువులకు సైతం ఈ సూక్తి అమలు చేసేలా చూడాలని తెలిపారు. అనంతరం వాల్టా, ఇతర అటవీశాఖ చట్టాలను వివరించారు. అలాగే నందనవనంలో పెరిగిన ప్రతీ మొక్క శాసీ్త్రయ నామంతోపాటు వాటి వాడుక పేర్లు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ మొక్కల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో సారంగాపూర్ మండల అటవీశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.