
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు మృతి
భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారి మాటేగాం సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ద్విచక్రవాహనంతో ఢీకొని యశ్వంత్ (21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్, కుంసర గ్రామానికి చెందిన విలాస్ శుక్రవారం భైంసాకు వచ్చారు. పనులు ముగించుకుని భైంసా నుంచి ద్విచక్రవాహనంపై పేండ్‌పెల్లికి వెళ్తున్నారు. మాటేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై ట్రాక్టర్ ట్రాలీ ఫంక్షర్ కావడంతో అక్కడే నిలిపి ఉంచారు. రోడ్డుపై ఉన్న ట్రాలీని వీరు ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా పేండ్‌పెల్లికి చెందిన యశ్వంత్ మృతి చెందాడు.