ఉన్నత విద్య.. ఉత్తదే! | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య.. ఉత్తదే!

Aug 6 2025 7:08 AM | Updated on Aug 6 2025 7:08 AM

ఉన్నత విద్య.. ఉత్తదే!

ఉన్నత విద్య.. ఉత్తదే!

● పేరుకే పీజీ కాలేజీ.. ● కోర్సులు, చదువులు గాలికి.. ● ఆదివాసీ మ్యూజియం మూసివేత.. ● పాతకథలు చెబుతున్న ‘కాకతీయ’..! ● డిగ్రీ కాలేజీనీ పంపించేశారు ● ఇప్పటికీ ‘పాఠం’నేర్వని నిర్మల్‌ జిల్లా..

నిర్మల్‌: యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సినచోట కనీసం డిగ్రీ కాలేజీలనూ ఉంచడం లేదు. కొత్త కోర్సులు పెట్టడం అటుంచి, ఉన్న వాటినీ తరలించేస్తున్నారు. పేదవిద్యార్థులకు పైచదువులు అందకుండా రెగ్యులర్‌ కోర్సులను సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులుగా మార్చేశారు. పీజీ సెంటర్‌లో ఉమ్మడిజిల్లా ఆదివాసీ సంస్కృతిని కళ్లకు కట్టించిన మ్యూజియాన్నీ మాయం చేశారు. చదువులతల్లి కొలువైన జిల్లాలో ఉన్నతవిద్య ఉత్తమిథ్యగా మారింది.

ఇదేం ‘పరీక్ష’..!?

ఈ మధ్యనే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పీజీకి సంబంధించిన ఇంటర్నల్‌ పరీక్షలు నిర్వహించారు. నిర్మల్‌ పీజీ సెంటర్‌లోనూ పరీక్షలు పెట్టారు. కానీ.. ఈ విషయం అసలు ఎవరికీ తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా హన్మకొండ యూనివర్సిటీ నుంచి ఒకరు వచ్చి, ఐదురోజులు నిర్వహించాల్సిన పరీక్షలన్నీ ఒకేరోజు పూర్తిచేసి వెళ్లిపోయారు. అంతే.. అలా ఇంటర్నల్స్‌ పూర్తిచేసేశారు. అసలు అధ్యాపకులే లేని, క్లాసులే నిర్వహించని కాలేజీలో పరీక్షలు ఇంకెలా ఉంటాయి మరి. ఇదొక్క ఉదాహరణ చాలు జిల్లాలో ఉన్నతవిద్య తీరు ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి. దశాబ్దకాలంగా విద్యావంతులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఎంత గొంతెత్తుతున్నా.. అటు కేయూ పట్టించుకోవడం లేదు. ఇటు జిల్లా పాలకులూ నిర్లక్ష్యం వీడటం లేదు.

ఎన్నాళ్లీ నిర్లక్ష్యం..!?

ప్రజల అమాయకత్వమా..!? నాయకుల అవగాహన లోపమా..!? పాలకుల నిర్లక్ష్యమా..!? అధికారుల పట్టింపులేనితనమా..!? ఏది ఏమైతేనేం ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారాల్సిన జిల్లా, ఉన్న కాలేజీలు, కోర్సులు పోయి ఖాళీ అవుతోంది. రేపటితరానికి ‘ఇక్కడ కాలేజీ ఉండేది..’ అని ఉత్త భవనాలను చూపెట్టాల్సిన దుస్థితి వచ్చింది. ప్రతీ పీజీ సెంటర్‌ వైఎస్సార్‌ హయాంలో యూనివర్సిటీగా ఎదిగితే.. నిర్మల్‌ పీజీ సెంటర్‌ మాత్రం ఉల్టా అయ్యింది. స్థానికంగా ప్రజలు, పాలకులు, అధికారులు, అన్నివర్గాల నుంచి సరైన స్పందన లేనికారణంగానే ఈ దుస్థితి దాపురించినట్లు విద్యావంతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా ‘జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ’ కోసం జిల్లావాసులు ఉద్యమించాల్సిన అవసరం ఉందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement