మాకొద్దు.. జీపీవో కొలువు | - | Sakshi
Sakshi News home page

మాకొద్దు.. జీపీవో కొలువు

Aug 4 2025 4:22 AM | Updated on Aug 4 2025 4:22 AM

మాకొద్దు.. జీపీవో కొలువు

మాకొద్దు.. జీపీవో కొలువు

● పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏల అనాసక్తి ● నోటిఫికేషన్‌లు ఇచ్చినా స్పందనేది? ● పరీక్ష రాసింది 133 మంది మాత్రమే ● సర్వీస్‌ కోల్పోతామనే భయంతోనే..

నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామపాలన అధికారి (జీపీవో)గా పనిచేసేందుకు పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఆసక్తి చూపడంలేదు. ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించినా వెనుకడుగు వేశారు. జీపీవోలుగా చేరితే పాత సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రమోషన్లలో వెనుకబడిపోతామన్న ఆందోళన వారిలో నెలకొంది.

జిల్లాలో 430 రెవెన్యూ గ్రామాలు

జిల్లాలో 18 మండలాలు, 400 పంచాయతీలుండగా 430 రెవెన్యూ గ్రామాలున్నాయి. గతంలో 96 మంది వీఆర్వోలు, 748 వీఆర్‌ఏలు జిల్లాలో విధులు నిర్వర్తించారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకువచ్చి 2020లో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసింది. గ్రామాల్లో పని చేస్తున్న ఆ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం తెచ్చిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. రెవెన్యూశాఖకు పూర్వవైభవం తెస్తామని, గ్రామానికో జీపీవోను నియమించి భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా వీఆర్వోల స్థానంలో జీపీవోలను నియమించాలని నిర్ణయించింది. గతంలో వీఆర్వోలుగా పనిచేసిన వారు తిరిగి రావాలని కోరింది. అందుకోసం రెండుసార్లు రాత పరీక్ష నిర్వహించగా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదటిసారి జిల్లావ్యాప్తంగా 155 మంది దరఖాస్తు చేయగా ఇందులో 105 మందిని అర్హులుగా గుర్తించారు. పరీక్షకు 96 మంది హాజరు కాగా, 61 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రెండోసారి జూలై 27న పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసేందుకు 75 మంది దరఖాస్తు చేయగా ఇందులో 55 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో 37మంది మాత్రమే పరీక్ష రాయగా, ఇంకా ఫలితాలు విడుదల కాలేదు.

ఒక్కరికి మూడు గ్రామాలు తప్పవా?

ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. జిల్లాలో 430 రెవెన్యూ గ్రామాలుండగా 430 మంది జీపీవోలను నియమించాల్సి ఉంది. కానీ.. పూర్వ వీఆర్వోలు 96 మంది, వీఆర్‌ఏలు 748 మందిలో 133 మంది మాత్రమే పరీక్ష రాశారు. దీంతో ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

జిల్లాలో మొత్తం వీఆర్వోలు 96

వివిధ శాఖల్లో భర్తీ అయినవారు 93

రిపోర్టు చేయకుండా ఉన్నవారు 3

మొత్తం వీఆర్‌ఏలు 748

మరణించిన వీఆర్‌ఏలు 12

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏలు 60

జీపీవోకు మొదటివిడతలో

దరఖాస్తు చేసుకున్నవారు 151

అర్హులు 105

పరీక్ష రాసిన వారు 96

ఉత్తీర్ణులైనవారు 61

రెండోవిడత దరఖాస్తు

చేసుకున్నవారు 75

అర్హులు 55

పరీక్ష రాసినవారు 37

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement