
ఫేస్ రికగ్నిషన్ హాజరు సగమే..
● రెండోరోజు 50శాతం నమోదు ● అడ్డంకిగా సర్వర్, నెట్‌వర్క్ సమస్య ● డుమ్మా టీచర్లకు చెక్ పడేనా?
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు అన్ని రకాల వసతులు సమకూర్చుతోంది. ఉపాధ్యాయులు తరచూ డుమ్మా కొ డుతున్నారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ము ఖ గుర్తింపు హాజరును అమలులోకి తెచ్చింది. ఈ నెల 1నుంచి జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తోంది.
జిల్లాలో హాజరు తీరు ఇలా..
జిల్లాలో 710 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 3,018 మంది ఉపాధ్యాయులుండగా శనివారం వరకు 2,062 మంది ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇంకా 956 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. రెండోరోజైన శనివారం జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 2,062 మంది ఉపాధ్యాయుల్లో 1,031 మంది మాత్రమే ముఖ గుర్తింపు హాజరు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కొందరు ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేసుకున్నా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని తెలిపారు.
ఆదిలోనే ఆటంకాలు
ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు ప్రక్రియకు ఆదిలోనే పలు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రధానంగా సర్వర్, నె ట్‌వర్క్ సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలి పారు. ఈ కారణంగా చాలామంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడం లేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉపాధ్యాయుల్లోనూ సర్వర్, నెట్‌వర్క్ సమస్యతో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అప్‌లోడ్ కావడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో కొందరు టీచర్లు సర్దుబాటు పాఠశాలలో ఫేస్ రికగ్నిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఎక్కడ తమ హాజరు నమోదు చేసుకోవాలో తెలియని గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలు త్వరగా పరిష్కరించి గ్రామీణ ప్రాంతాల్లోనూ నెట్‌వర్క్ సమస్య లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
యాప్‌ను ఫ్రెండ్లీగా మార్చాలి
యాప్‌ను టీఎస్ యూటీఎఫ్ తరఫున స్వాగతిస్తున్నాం. యాప్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య లేకుండా చూడాలి.
– శంకర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు

ఫేస్ రికగ్నిషన్ హాజరు సగమే..