
ఆర్జీయూకేటీ సంకల్పం
● ర్యాగింగ్, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన
బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో జిల్లా న్యాయసేవా సమన్వయంతో ‘ర్యాగింగ్ నివారణ, మాదకద్రవ్యాల విపత్తు నివారణ’పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ఇన్‌చార్జి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, భైంసా మేజిస్ట్రేట్ దేవేంద్రబాబు, ఏఎస్పీ అవినాష్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ర్యాగింగ్, డ్రగ్స్‌పై కఠిన చర్యలు..
ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ, క్యాంపస్‌ను ర్యాగింగ్, మాదకద్రవ్య రహితంగా ఉంచడం తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా జడ్జి వాణి ర్యాగింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలను వివరిస్తూ, ఫిర్యాదులపై కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. 1832–44లో చైనా–బ్రిటన్ డ్రగ్ యుద్ధాలను ఉదాహరణగా చెప్పారు. సీనియర్ జడ్జి రాధిక, న్యాయ సేవాసంస్థ పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు సేవలందిస్తోందని, విద్యార్థులను లీగల్ పారా వాలంటీర్లుగా చేరాలని కోరారు.
వసతి గృహాల పరిశీలన..
1997లో తమిళనాడు ర్యాగింగ్ నిరోధక చట్టం తీసుకొచ్చిన నేపథ్యాన్ని రాధిక వివరించారు. ర్యాగింగ్ ఫిర్యాదులను కమిటీకి తెలపాలని సూచించారు. అనంతరం బాలికల వసతి గృహం, భోజనశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కోర్టు సూపరింటెండెంట్ పురుషోత్తంరావు, ముధోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్సై శ్రీనివాస్, డీన్‌లు నాగరాజు, డాక్టర్ విఠల్, చంద్రశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.