
‘నిర్మల’మైన మైత్రిబంధం..
కల్మషం.. అసూయ.. ద్వేషం లేనిది స్నేహం. ఒకరికిఒకరు అన్నట్టుగా ఉంటూ, కష్టసుఖాల్లో కలిమిలేములలో భుజం తట్టి తోడుగా నిలిచే స్నేహం ఏ బంధానికి సాటిరాదు. ఇందుకు నిదర్శనం నిర్మల్‌కు చెందిన ఈ 11 మంది మిత్ర బృందం. పుష్కరకాలానికి పైగా కలిసిమెలిసి ఉంటూ ‘నిర్మలమిత్ర’ పేరుతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తున్నారు. అంతా కలిసి కుటుంబాలతో ఆనందోత్సాహాల మధ్య గడుపుతున్నారు. ఏదైనా అనుకోని కష్టం వచ్చినా రక్తసంబంధీకులు బంధువులు వస్తారో రారో తెలియదు కానీ వీరు మాత్రం క్షణాల్లో అక్కడికిచేరి భరోసా అందించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వీరంతా కష్టపడి చదివి వివిధ రకాల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన వీరందరూ ఉద్యోగరీత్యా నిర్మల్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ వారానికోసారి కలుసుకుంటారు. సాధక బాధకాలను పంచుకోవడం వీరి మైత్రిబంధాన్ని బలోపేతంచేస్తోంది.