
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
కడెం: కడెం ప్రాజెక్టు కుడి కాలువ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని మండలంలోని చిట్యాల్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులకు శనివారం వినతిపత్రం అందజేశారు. కొండుకూర్ నుంచి చిట్యాల్ వరకు కుడి కాలువ పిచ్చిమొక్కలు, చెత్తచెదారంతో నిండిపోవడంతో సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. చిట్యాల్ శివారులో సుమారు 500 ఎకరాల ఆయకట్టు ఉందని, నాట్లు వేసేందుకు సాగు నీటి కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అధికారులు స్పందించి పిచ్చిమొక్కలు, చెత్తచెదారం తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్, రైతులు ధర్మాజి కిష్టయ్య, రమేశ్, జలపతి, ఇస్రూ, తిరుపతిరెడ్డి, ఇందన్న, శంకరయ్య, గంగారెడ్డి, రాజలింగు, నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.