
కొత్త రేషన్ కార్డులతో పేదలకు సంక్షేమం
● కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
మామడ/సోన్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ కార్డులతో పేదలకు సంక్షేమ పథకాలు చేరువవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మామడ, సోస్ మండల కేంద్రాల్లో ఆయా మండలాల లబ్ధిదారులకు మంగళవారం రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలాకాలం తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. వచ్చేనెల నుంచి నూతన రేషన్‌కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలన్నారు. మామడ మండలానికి 660, సోన్ మండలానికి 863 రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ సేవలను నూతన రేషన్ కార్డుదారులకు అందుబాటులోకి తేవాలని కోరారు. పేద ప్రజలకు రేషన్ బియ్యం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. సోన్‌కు చెందిన గనాయి నర్సింహులు ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, పౌరసరాఫరాల అధికారి రాజేందర్, ఆర్డీవో రత్న కళ్యాణి, జెడ్పీ సీవో గోవింద్, డీఈ తుకారం, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో సురేశ్, నిర్మల్ మార్కెట్ చైర్మన్ భీంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.