
● నిర్మల్‌లో అడుగడుగునా కబ్జాలే ● మితిమీరుతున్న కబ్జా ర
ఆక్రమణలతో జిల్లా కేంద్రంలోని చెరువు ఇలా..
నిర్మల్: హైడ్రా.. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణదారులను వణికిస్తున్న ఆపరేషన్. జీహెచ్‌ఎంసీతో పాటు హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ ఆక్రమణలు, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లను ఎత్తుతోంది. ఎంతటి భవనాలైనా నేలమట్టం చేసేస్తోంది. చెరువులు, పార్కులతో పాటు లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపైనా ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
సరిగ్గా.. నిర్మల్‌లో కూడా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) తరహాలో ఆపరేషన్ అవసరమని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇక్కడా అడుగడుగునా కబ్జాలే. అణువణువునా ఆక్రమణలే. ఎక్కడ సర్కారు జాగా ఖాళీగా ఉంటే అక్కడ పాగా వేసేస్తున్నారు. ఏకంగా బహుళ అంతస్థుల భవనాలు కూడా నిర్మిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని చారిత్రక గొలుసుకట్టు చెరువులనూ వదలట్లేదు. కబ్జారాయుళ్లు చెరువుల చైన్ లింకులను తెంచేసి పట్టణాన్ని ముంచేస్తున్నారు.
ఎఫ్‌టీఎల్ దాటి మరీ..
జిల్లాలో చెరువుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. శిఖం భూములు, ఎఫ్‌టీఎల్ (ఫుల్‌ట్యాంక్ లెవల్) దాటి పోయి, చెరువు గర్భం వరకూ ఆక్రమించిన ఆనవాళ్లున్నాయి. జిల్లాకేంద్రంలోనే చిన్నరాంసాగర్, ఇబ్రహీం చెరువు, ధర్మసాగర్, కంచెరో ని చెరువు తదితర గొలుసుకట్టు చెరువులన్నీ కబ్జాల చెరలో ఉన్నాయి. వందల ఎకరాల్లో చెరువుల భూ ములు ఆక్రమించేశారు. ఎఫ్‌టీఎల్ దాటడమే కా దు.. చెరువుల తూములను మూసేసి కాలువలను చెరిపేసి వెంచర్లు వేస్తుండటం మరింత దారుణం. జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయం ఎదుట భీమన్నకుంటనూ క్రమంగా మూసేస్తున్నారు. పక్కనే ఉ న్న ఇబ్రహీం చెరువు తూములకూ ఎసరు పెడుతున్నారు. కొండాపూర్ చెరువులోనే ఇటీవల పిల్లర్లు వే సి మరీ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు.
చారిత్రక కట్టడాలనూ వదలని వైనం
జిల్లాకేంద్రంతో పాటు జిల్లావ్యాప్తంగా దశాబ్దాల కిందటి చారిత్రక ఆనవాళ్లు ఎన్నో ఉండేవి. కడెం నుంచి కుభీర్ వరకూ ఇలాంటి కట్టడాలున్నాయి. కానీ.. ఇందులో చాలావరకు కనుమరుగు చేశారు. గ్రామావసరాల పేరు చెప్పి పాలకులు, నేతలే కబ్జాలు చేసిన ఘటనలున్నాయి. ఇక జిల్లాకేంద్రంలో మరీ దారుణం.. ఉన్నతాధికారులందరూ ఉండే ఇక్కడే చారిత్రక కట్టడాలను కబ్జా చేశారు. పట్టణం చుట్టూ ఉన్న రక్షణగోడ, కందకం, జౌళినాలాలనూ వదలిపెట్టలేదు. సమీకృత మార్కెట్‌కోసం చదును చేసిన పాత తహసీల్ కార్యాలయ స్థలం కూడా తాజాగా కబ్జా చేస్తుండటం గమనార్హం. ఇంతా జరుగుతున్నా సరైన చర్యలు చేపట్టడంలేదు.
హైడ్రా.. ఇక్కడా అవసరమే..
జిల్లాలో చెరువుల పరిరక్షణ కోసం అడిషనల్ కలెక్టర్ అధ్యక్షతన లేక్‌కమిటీ ఏర్పాటు చేసినా చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వస్తున్న ఫిర్యాదులతో పోలిస్తే అరకొరగానే చర్యలు ఉంటున్నాయి. గతంలో నిర్మల్‌లో గొలుసుకట్టు చెరువుల పరిరక్షణపై ఏకంగా హైకోర్టు ఆదేశాలిచ్చినా.. అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటికీ ఎఫ్‌టీఎల్‌లో కబ్జాలు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూముల్లో నిర్మాణాలనూ అడ్డుకోవడం లేదు. బఫర్‌జోన్‌లలో వెంచర్లు వేసి, జనాలను ముంచేస్తున్న ఘటనలూ ఎదురవుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హైడ్రా ఆపరేషన్‌లాగా జిల్లాలోనూ కఠిన చర్యలు అవసరమన్న వాదన పెరుగుతోంది.