శక్తిమంతమైన 'జీరో రూపాయి నోట్' గురించి మీకు తెలుసా?

Zero Rupee Note To Be Introduced in India To Fight Corruption - Sakshi

మనలో చాలా మందికి ఒక రూపాయి నోటు, ఐదు, పది, 20,50, 100, 200, 500,  2000 రూపాయి నోటు గురుంచి తెలుసు కానీ, మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న "జీరో రూపాయి నోట్" గురుంచి చాలా మందికి తెలియదు. అసలు ఈ నోటుకు ఉన్న శక్తి గురుంచి చాలా మందికి తెలియదు అని చెప్పుకోవాలి. అసలు ఇది ఎక్కడ లభిస్తుంది. దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

మన దేశంలో అవినీతి ఇప్పటికీ జరుగుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అధికారులను ఎదిరించలేక వారు అడిగిన ఎంతో కొంత మొత్తం ప్రజలు ఇస్తూ వస్తున్నారు. మన దేశంలో లంచం అడగడం, ఇవ్వడం రెండూ కూడా చట్ట ప్రకారం నేరం. అమెరికాలో జాబ్ చేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఎన్నారై ఆనంద్ మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అవినీతిని చూసి ఏదైనా చేయాలని అనుకున్నాడు. అవినీతిని తొలిగించడానికి ఏమి చేయాలో ఆలోచించిన విజయ్ ఆనంద్ దేశంలో అవినీతిపై పోరాడాలనే ఏకైక ఉద్దేశ్యంతో 2006లో 5వ పిల్లర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. 

జీరో రూపాయి నోట్ ప్రధాన ఉద్దేశ్యం
ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల(శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, పత్రికా)ను దాటి మెరుగైన సమాజం, అవినీతి రహిత పాలనా వ్యవస్థ కోసం కృషి చేస్తున్న ప్రజల కోసం 5వ పిల్లర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. 2007లో విజయ్ సమాజంలో అవినీతి నిర్మూలించడానికి ది "జీరో రూపాయి నోట్" అనే ఒక కాన్సెప్ట్ ను ముందుకు తీసుకువచ్చాడు. జీరో రూపాయి నోట్లు సామాన్యులకు సాధికారత కల్పించడానికి ముద్రించబడ్డాయి. అవినీతి చేత ఎక్కువగా బాధపడేవారు, తరచుగా అవినీతి అధికారులచే అణచివేయబడేవారు అధికారంలో ఉన్నవారికి భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పడం, తాము కోల్పోవడానికి ఏమీ లేదని అవినీతి అధికారులకు తెలియజేయడం, వారు పోరాటంలో ఒంటరిగా లేరని చెప్పడం ఈ నోట్ ప్రధాన ఉద్దేశ్యం.

30 లక్షల నోట్ల పంపిణీ
5వ పిల్లర్ వాలంటీర్ల సహాయంతో దీని గురుంచి అవగాహన కలిగించడానికి స్థానిక మార్కెట్ ప్రదేశాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లలో జీరో రూపాయి నోట్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. వారు కరపత్రాలతో పాటు నోట్లను పంపిణీ చేస్తూ వివిధ ప్రదేశాలలో సమాచార డెస్క్ లను ఏర్పాటు చేశారు. 5th పిల్లర్ సంస్థ 30 లక్షల నోట్లను 2007 నుంచి 2014 వరకూ ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చింది. ఈ నోట్లను మొదటిసారి చెన్నైలోని డొమెస్టిక్ విమానాశ్రయంలో ఉపయోగించారు. అక్కడ విజయవంతం కావడంతో తమిళంతో పాటూ… తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నోట్లను ప్రింట్ చేస్తున్నారు. ఒక్క భారత్ లోనే కాదు ఈ ఫిఫ్త్ పిల్లర్ సంస్థ మెక్సికో, నేపాల్ వంటి దేశాల్లో కూడా జీరో నోట్లను ముద్రించి ఇస్తోంది. 2020లో మన దేశంలో అవినీతి ఏ రేంజ్ లో ఉంది అనే అంశంపై ఈ సంస్థ అధ్యయనం జరిపించగా.. సంవత్సరానికి రూ.490 కోట్ల అవినీతి జరుగుతోందని తేలింది.

ఒకవేల మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే జీరో రూపాయి నోట్ చూపించాలని పేర్కొన్నాడు. ఈ నోటు చూపించక కూడా మీతో అతను ప్రతిఘటిస్తే ఈ నోట్లను ఇవ్వండి అని కోరుతున్నారు ఆనంద్. వీటిని ఇచ్చే ముందు నోట్ వెనుక సూచించిన చిరునామాను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. ఇలా సమాచారం ఇచ్చిన తర్వాత అతని లంచావతారం సంగతి అధికారులు చూసుకుంటారని ఆనంద్ చెబుతున్నారు. దేశంలోని ప్రతి అణచివేతకు గురైన భారతీయుడు, అవినీతి అధికారికి జీరో రూపాయి నోటు చేరేలా చూడాలని 5వ పిల్లర్ కోరింది. ఇది ఖచ్చితమైన అహింసాత్మక ఆయుధం, అవినీతిపరులను ఆత్మపరిశీలన చేసుకోవడానికి సరైన మార్గం అని ఆనంద్ అన్నారు. ఎవరికైనా ఈ నోట్లు కావాలంటే ఈ సంస్థ వెబ్‌సైట్‌ (https://5thpillar.org)లోకి వెళ్లి డౌన్లోడ్చేసుకోవచ్చు. చేయి చేయి కలుపుదాం.. మనదేశంలో అవినీతిని రహిత సమాజాన్ని నిర్మిద్దాం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top