సాక్షి, హైదరాబాద్/ అల్లూరి జిల్లా: మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. రంపచోడవరం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ అలియాస్ రాజే, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
మృతుల్లో లక్మల్, కమ్లూ, మల్లా, దేవ్(హిడ్మా గార్డ్) ఉన్నారు. హిడ్మా మృతిని అటు ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖతో పాటు ఇటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా ధృవీకరించారు.
గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా.. మూడు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్‌గా మారారు. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్‌గా మారారు. ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు. తాజాగా.. రెండు వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి కలిశారు. ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు. ‘‘ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డా’’ అని ఆమె హిడ్మాను వేడుకున్నారు కూడా. ఈలోపే ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతి చెందడం గమనార్హం. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉంది. ఆయన సతీమణి హేమపై రూ.50 లక్షల రివార్డు ఉంది.

ఎన్‌కౌంటర్ జరిగిన ఏరియా
భారీగా ఆయుధాలు స్వాధీనం
హిడ్మా మృతిపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా మీడియాతో స్పందించారు. ఎన్‌కౌంటర్ అయిన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారాయన. ‘‘రెండు రోజుల కిందటే మాకు పక్కా సమాచారం వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో తలదాచుకునే అవకాశం లేకపోవడంతో ఏపీకి వచ్చే ప్రయత్నం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా ఉంచాం’’ అని అన్నారాయన.

హిడ్మా నేపథ్యం..
మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో.. అత్యధిక దళ సభ్యులు(మల్లా, నిషాద్ వర్గాల ప్రజలు) ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఉంది.
కిషన్‌జీ సారథ్యంలో హిడ్మా తొలి అడుగు పడింది. 25 ఏళ్ల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించారు. ఆయన దళానికి అత్యంత శక్తివంతమైన టీంగా పేరుంది. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై ఆయనకు పట్టుంది. చిన్నవయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నియ్యాడు. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫొటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ను కొనసాగించాయి.
హిడ్మా స్కెచ్ వేస్తే..
మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నారు..
- 2007లో సుక్మా జిల్లా ఉర్పల్‌మెట్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి చేసి, హతమార్చారు
- 2010లో తడ్‌మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు
- 2013లో జీరామ్‌ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర
- 2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చాడు
- 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు


