
న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనలను పాటించని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రెండు విడతలుగా మొత్తం 810 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. మొదటి జాబితాలో 334 పార్టీలు, రెండో జాబితాలో మరో 476 పార్టీలను తొలగించింది. ఈ రద్దు చేసిన పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మొత్తం 44 పార్టీలు ఉన్నాయి.
రద్దుకు గల కారణాలు...
2019 నుండి గత ఆరు సంవత్సరాలలో ఒక్క ఎన్నికలలో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీలను (రిజిస్టర్డ్ అన్-రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ - RUPP) గుర్తించి, వాటిని జాబితా నుండి తొలగించడానికి ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్నికల వ్యవస్థను పారదర్శకంగా మార్చే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది.
ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే..
నిర్ధారిత చిరునామాలో లేకపోవడం
పార్టీలు వాటి రిజిస్టర్డ్ చిరునామాలలో అందుబాటులో లేకపోవడం.. ఈసీ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, ఈ విషయాన్ని నిర్ధారించుకుంటారు.
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడం
గత ఆరేళ్లుగా ఈ పార్టీలు ఏ ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం. దీనిని కూడా ఎన్నికల అధికారులు నిర్ధారించుకుంటారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951, ఆదాయపన్ను చట్టం-1961 వంటి చట్టాలలోని నిబంధనలను ఉల్లంఘించిన రాజకీయపార్టీలు రద్దవుతాయి.
రద్దయిన పార్టీలు
మొదటి జాబితాలో రద్దు చేసిన 334 పార్టీలలో తెలంగాణ నుండి 13, ఆంధ్రప్రదేశ్ నుండి 5 పార్టీలు ఉన్నాయి. రెండో జాబితాలో తెలంగాణ నుండి 9, ఆంధ్రప్రదేశ్ నుండి 17 పార్టీలు ఉన్నాయి.
కోల్పోయే ప్రయోజనాలు
ఈసీ నిర్ణయంతో రద్దయిన పార్టీలు ఇకపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29సీ, 29బీ, ఆదాయపన్ను చట్టం-1961, ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్ 1968 వంటి నిబంధనల కింద లభించే ప్రయోజనాలను కోల్పోతాయి.
గుర్తింపు పొందిన పార్టీలివే..
ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 67 రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఎంఐఎం, బీఆర్‌ఎస్, జనసేన, తెలుగు దేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సీపీలు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉన్నాయి.