రేపు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

Union Ministry Of Water Resources Will Issue Gazettes On Krishna Godavari - Sakshi

న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ రేపు(శుక్రవారం) గెజిట్లు విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల చేయనుంది. రెండు బోర్డులకు వేర్వేరుగా కేంద్రం గెజిట్లు విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదం నేపథ్యంలో గెజిట్లకు ప్రాధాన్యమేర్పడింది. ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం జల బోర్డుల పరిధి నిర్ధేశించే అధికారం కేంద్రానిదే. దీనిలో భాగంగానే వాటి పరిధిపై కేంద్రం వేర్వేరుగా గెజిట్లు విడుదల చేయడానికి సమాయత్తమైంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తోందని, కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని కేంద్రానికి తెలిపారు. 

పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోందని, కేఆర్‌ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుందని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా.. సీఐఎస్‌ఎఫ్‌ బలగాల పరిధిలోకి ప్రాజెక్ట్‌లను తేవడమే కాకుండా తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా.. కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top