ధైర్యముంటే ఎదురునిల్చి పోరాడండి: సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

Uddhav Thackeray Slams On BJP Over ED CID And IT Raids - Sakshi

ఈడీ, సీబీఐ, ఐటీ ముసుగులో రాష్ట్ర మంత్రులపై దాడి ఎందుకు?

కేంద్ర ప్రభుత్వంపై శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు 

సాదాసీదాగా శివసేన దసరా మేళావ నిర్వహణ

సాక్షి, ముంబై: ధైర్యముంటే ఎదురుగా నిలిచి పోరాడాలని, మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వంలోని మంత్రులపై ఈడీ, సీబీఐ, ఐటీ ముసుగులో ఎందుకు దాడి చేస్తున్నారని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా వ్యాఖ్యానించారు. మాటుంగాలోని షణ్ముఖానంద హాలులో శుక్రవారం శివసేన దసరా మేళావ నిర్వహించారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం మాదిరిగా ఈ సారి కూడా సాదాసీదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఏటా శివాజీపార్క్‌లోని మైదానంలో జరిగే దసరా మేళావకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షకుపైగా కార్యకర్తలు తరలి వచ్చేవారు. కానీ ఈ సారి కీలకమైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పదాధికారులు సహా సుమారు వేయి మంది సమక్షంలో మేళావా జరిగింది. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ ఠాక్రే అనేక అంశాలపై శివసేన కార్యకర్తలకు మార్గదర్శనం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న బీఎంసీ ఎన్నికల ప్రచారానికి ఉద్ధవ్‌  శంఖం పూరించారు.  

ఒకేతాటిపైకి రావాలి
కుల, మత, మరాఠీ, మరాఠేతర అనే భేదాలను పక్కన బెట్టి హిందులందరూ ఒకతాటిపైకి రావల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. హిందువులకు ఎలాంటి ప్రమాదం లేదని, ఇలాంటి వారి (పరోక్షంగా బీజేపీని ఉద్ధేశించి)వల్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు ఎన్ని కుయుక్తులు, పన్నాగాలు పన్నినా, తమ ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధైర్యముంటే ప్రభుత్వాన్ని కూల్చి చూపించాలని సవాలు విసిరారు. వచ్చే బీఎంసీ ఎన్నికల్లో మరాఠీ, మరాఠేతర విభేదాలు సృష్టించి ప్రజల్లో చీలికలు తెచ్చే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. హరహర మహాదేవ్‌ నినాదంతో వచ్చే బలమేంటో కేంద్రానికి రుచి చూపించాలన్నారు.

హిందుత్వం అనే కార్డును అడ్డుపెట్టుకుని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న వారు ఇప్పుడు అదే కార్డును అడ్డుపెట్టుకుని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే తను రాజకీయాల నుంచి తప్పుకుని ఉండేవాడినని అన్నారు. ఓ శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రి చేయాలని తన తండ్రి, శివసేన అధినేత దివంగత బాల్‌ ఠాక్రే కోరిక అని గుర్తు చేశారు. ఆ మేరకు తన తండ్రికి ఇచి్చన మాటకు కట్టుబడి ఉండేందుకు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని చరెప్పారు. ఇంతటితో తన బాధ్యత పూర్తికాలేదని, భవిష్యత్తులో శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. 

పార్టీ జోలికి రావద్దు 
అనేక సంవత్సరాలుగా శివసేన, బీజేపీ కలిసి వివిధ ఎన్నికల్లో పోటీ చేశాయి. కూటమిగా ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఆకస్మాత్తుగా శివసేన అవినీతిగా ఎలా మారిందని నిలదీశారు. తమతో ఉంటే ఒక మాట, విడిపోతే మరో మాట చెప్తూ.. రెండు నాల్కల ధోరణి బీజేపీ అవలంభిస్తోందని దుయ్యబట్టారు. మీ పల్లకిలు మోసేందుకు శివసేన పుట్టలేదు. గడ్డుకాలంలో సైతం బీజేపీకి అండగా నిలిచాం. అప్పుడు తమ పార్టీ అవినీతి పార్టీ అని గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. వెన్నుపోటు పొడవకుండా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే శివసేన పార్టీ ధ్యేయమని మరోసారి గుర్తు చేశారు.

అనవసరంగా తమ పార్టీ మంత్రులపై ఈడీ, సీఐడీ, ఐటీ దాడులు చేయించవద్దని, ముఖ్యంగా తమ పార్టీ జోలికి రావద్దని, ఒకవేళ వస్తే కొమ్ములతో పొడుస్తామని హెచ్చరిం చారు. దసరా మేళావకు ఎంపీ సంజయ్‌ రావుత్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్‌ దేశాయ్, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఎంపీలు గజానన్‌ కీర్తికర్, వినాయక్‌ రావుత్, అనీల్‌ దేసాయి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top