విజయ్‌కి, 1994 నాటి S.R.బొమ్మై కేసుకి సంబంధం ఏంటి? | TVK vijay and SR Bommai vs Union of India 1994 3 SCC | Sakshi
Sakshi News home page

విజయ్‌కి, 1994 నాటి S.R.బొమ్మై కేసుకి సంబంధం ఏంటి?

May 8 2026 3:17 PM | Updated on May 8 2026 3:28 PM

TVK vijay and SR Bommai vs Union of India 1994 3 SCC

తమిళనాడులోని నాటకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1994 నాటి చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ఇపుడు ప్రధాన చర్చల్లో నిలుస్తోంది. భారత రాజ్యాంగ చరిత్రలో S.R .బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో  సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పును అత్యంత కీలకమైన తీర్పుగా రాజకీయ విశ్లేషకులు ఉదహ రిస్తుంటారు. ఈ విషయాన్నే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం కూడా గుర్తు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టానుసారంగా బర్తరఫ్ చేసే కేంద్ర ప్రభుత్వ అధికారాలకు ఈ తీర్పు కళ్లెం వేసిన తీర్పు ఇది. రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడానికి ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) దుర్వినియోగానికి పెద్ద అడ్డుకట్ట వేసింది. సమాఖ్యవాదం రాజ్యాంగం ప్రాథమిక లక్షణమని, రాష్ట్రపతి అధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని  తేల్చి చెప్పిన తీర్పు  ఇది.

అసలేంటీ  కేసు, పూర్వాపరాలు  
1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్.ఆర్. బొమ్మై నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ బర్తరఫ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారని, ప్రభుత్వానికి మెజారిటీ లేదని గవర్నర్ నివేదిక ఇవ్వడమే దీనికి కారణం. అయితే, తనకు మెజారిటీ ఉందో లేదో అసెంబ్లీలో నిరూపించుకుంటానని బొమ్మై కోరినప్పటికీ, గవర్నర్ అవకాశం ఇవ్వకుండానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)ను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీనిని సవాలు చేస్తూ బొమ్మై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు  ధర్మాసనం కీలక మార్గదర్శకాలు
ఈ కేసును విచారించిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది.  రాష్ట్రాలకు అసెంబ్లీయే అసలైన వేదిక అని తేల్చి చెప్పింది. ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది గవర్నర్ బంగ్లా (రాజ్ భవన్)లో కాదు, అసెంబ్లీలోనే (Floor Test) అని కోర్టు స్పష్టం చేసింది.

  • న్యాయ సమీక్ష (Judicial Review)
    రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలు విచారణ జరపవచ్చు. ఒకవేళ ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తేలితే, రద్దు చేసిన ప్రభుత్వాన్ని కోర్టు తిరిగి పునరుద్ధరించవచ్చు.
    కేవలం రాజకీయ విభేదాల వల్ల లేదా కేంద్రంలో వేరే పార్టీ అధికారంలో ఉందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయకూడదు.

  • సెక్యులరిజం (Secularism) రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రాజకీయాలు చేస్తే దానిపై చర్యలు తీసుకోవచ్చని కూడా కోర్టు పేర్కొంది.

  • తీర్పు ప్రాముఖ్యత
    ఈ తీర్పు రాకముందు వరకు, కేంద్రంలో ఉన్న పార్టీలు, గవర్నర వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ,  తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్ 356 ఉపయోగించి ఇష్టానుసారంగా రద్దు చేసేవి. కానీ బొమ్మై తీర్పు తర్వాత పరిస్థితి మారింది.

  • రాష్ట్ర ప్రభుత్వాలకు రక్షణ పెరిగింది. గవర్నర్ల వ్యవస్థలో పారదర్శకత వచ్చింది. సమాఖ్య వ్యవస్థ (Federalism) బలోపేతం అయ్యింది.

ఇపుడెందుకీ ప్రస్తావన
108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వాంచినాల్సిన గవర్నర్‌, అందుకు బదులుగా మ్యాజిక్‌ ఫిగర్‌ 118ఎమ్మెల్యే సంతకాలతో రమ్మని కోరడం వివాదానికి దారి తీసింది. అదే తమిళనాట పెద్ద ప్రతిష్టంభనకు దారి తీసింది. ఈనేపథ్యంలోసుప్రీంతీర్పును అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుడు, ఆ పార్టీ నాయకుడికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, గవర్నర్ ముందే నిర్ణయానికి రాకూడదని ఈ తీర్పు చెబుతోంది. ఆర్టికల్ 356 అనేది అరుదైన పరిస్థితుల్లో మాత్రమే వాడాల్సిన ఆయుధమని ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. రాష్ట్రాలు కేవలం కేంద్రానికి అధీనంలో ఉండేవి కావని ఈ తీర్పు స్పష్టం చేసింది. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే శాసనసభను రద్దు చేయవచ్చు. తమిళనాడులో టీవీకే (TVK) పార్టీ విషయంలో  చిదంబరం ఈ కేసును ప్రస్తావించడానికి కారణం ఇదే.  

ఇదీ చదవండి: విజయ్‌కి ఛాన్స్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు
 

Advertisement
 
Advertisement
Advertisement