
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ ఆగంతకుడు చేసిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన సదరు వ్యక్తి.. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని పేల్చేస్తానంటూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
వివరాల ప్రకారం.. గురువారం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మనోజ్ కుమార్ అయోధ్యలోని రాంలాలా సదన్ నివాసి కాగా.. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని కల్పవస్‌లో ఉన్నాడు. అయితే, మనోజ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కాల్‌లో మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. దీంతో, భయాందోళనకు గురైన మనోజ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఫోన్ కాల్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కాగా, కాల్ ట్రాకింగ్ ఆధారంగా ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక, బాంబు బెదిరింపు నేపథ్యంలో అయోధ్యలో పోలీసు బందోబస్తు పెంచినట్టు పోలీసు ఉన్నాతాధికారులు స్పష్టం చేశారు.
आज दिनांक 02.02.2023 को रामलला सदन के एक शिष्य के मोबाइल पर अज्ञात व्यक्ति द्वारा श्री रामजन्मभूमि को बम से उड़ाने की धमकी देने के सम्बन्ध मे #ayodhyapolice द्वारा की जा रही कार्यवाही के सम्बन्ध मे पुलिस अधीक्षक नगर की बाईट। #UPPolice pic.twitter.com/cp9EcJmMtd
— AYODHYA POLICE (@ayodhya_police) February 2, 2023
ఇదిలా ఉండగా.. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం గర్భగుడిలో కొలువుతీరే బాలరాముడి విగ్రహ తయారీకి వినియోగించే పవిత్ర సాలగ్రామ శిలలను నేపాల్ నుంచి తెప్పించారు. దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల పురాతన శిలలుగా చెప్పబడే ఈ శిలలను నేపాల్‌లోని మస్తాంగ్ జిల్లాలోని ముక్తినాథ్‌కు సమీపంలో కాళీ గండకీ నదీ ప్రవాహప్రాంతం నుంచి సేకరించారు.
జానకీరాముల విగ్రహాలను చెక్కేందుకు 26 టన్నులు, 14 టన్నులు బరువైన ఈ రెండు శిలలను రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి అయోధ్యకు తీసుకొచ్చారు. 51 మంది వైదికుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శిలలను ఆలయానికి సంబంధించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ సందర్భంగా కరసేవక్‌పురంలో గురువారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలలను చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు తరలివచ్చారు. అంతకుముందు, సీతాదేవి జన్మస్థలంగా పేరొందిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి ఈ శిలల రోడ్డుమార్గ ప్రయాణం మొదలైంది.