ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ.. ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌

Terrorists Plan To Online Coaching - Sakshi

ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌.. యూట్యూబ్‌ కోచింగ్‌

న్యూఢిల్లీ : కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లూ, నిరంతర నిఘా మధ్య.. ఉగ్రవాద సంస్థల్లో నియామకాలు కష్టంగా మారడంతో ఉగ్రమూకలు శాస్త్ర సాంకేతికతను అనువుగా చేసుకొని ఆన్‌లైన్‌ నియామకాలకు శ్రీకారం చుట్టినట్టు భారత నిఘావర్గాలు కనిపెట్టాయి. భద్రతాదళాల అప్రమత్తత కారణంగా, ఉగ్రవాదుల పాచిక పారకపోవడంతో సైబర్‌ ఎత్తుగడతో రంగంలోకి దిగినట్టు సమాచారం. గత నెలలో 34 రాష్ట్రీయ రైఫిల్స్‌ ఆఫ్‌ ఆర్మీ ఎదుట లొంగిపోయినతవార్‌ వాఘే, అమీర్‌ అహ్మద్‌ మీర్‌లు వెల్లడించిన సమాచారంతో భారీస్థాయిలో ఉగ్రవాదుల సైబర్‌ రిక్రూట్‌మెంట్‌ జరుగుతున్న విషయం రూఢీ అయ్యింది. ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్లు నేరుగా సాగకపోవడంతో సైబర్, మొబైల్‌ అప్లికేషన్స్‌ ద్వారా నియామకాలు కొనసాగిస్తున్నాయి ఉగ్రమూకలు. భద్రతాదళాలు దారుణాలకు పాల్పడినట్లు ఫేక్‌ వీడియోలను సృష్టించి, పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థలు యువతలో ఎమోషన్స్‌ని రెచ్చగొట్టేపనిలో పడ్డాయి. గతంలో ఉగ్రవాదుల సానుభూతిపరులు నేరుగా నియామకాలు జరిపేవారు. ఉగ్రవాదుల సానుభూతిపరులను నిఘావర్గాలు అణచివేయడంతో వారు సైబర్‌ వేదికనుపయోగించుకొని ఉగ్రవాద సంస్థల్లో రిక్రూట్‌మెంట్లను నిర్వహిస్తూ, ఆన్‌లైన్‌ వేదికగా యూట్యూబ్‌లో శిక్షణను కూడా ఇస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
పీచమణిచిన భద్రతాదళాలు... 
గత ఏడాది 2020లో రెండు డజన్లకుపైగా ఇటువంటి ఉగ్రవాద వ్యవస్థలను భధ్రతాదళాలు ఛేదించి, దాదాపు 40 మంది సానుభూతిపరులను అరెస్టు చేశాయి. సైన్యంలోని 34 రాష్ట్రీయ రైఫిల్స్‌ ఎదుట లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు తవార్‌ వాఘీ, అమిర్‌ అహ్మద్‌ మీర్‌లు తాము ఆన్‌లైన్‌లో టెర్రరిస్టు గ్రూపులో చేరినట్టు వెల్లడించడంతో అసలు బండారం బట్టబయలైంది. భారీస్థాయిలో సైబర్‌ రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నట్టు తేటతెల్లమైంది. వీరిద్దరితో ఫేస్‌బుక్‌ ద్వారా పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపారు. ఖలీద్, మహ్మద్‌ అబ్బాస్‌ షేక్‌ అనే రిక్రూటర్‌ కోడ్‌ నేమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్‌ఐ సంస్థల్లో చేర్చుకున్నారు. ఆన్‌లైన్‌లో వివిధ లింకుల ద్వారా, యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమ వేదికల్లో వీరికి శిక్షణనివ్వడం మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. వీరిరువురు కేవలం ఒకే ఒక్కసారి, సౌత్‌ కశ్మీర్‌లోని షోపియాన్‌లో స్థానిక ఉగ్రవాద ముఠా వ్యక్తులతో నేరుగా కలిశారు. కశ్మీర్‌ లోయలో పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్‌ఐ వ్యవస్థీకరించిన స్లీపర్‌ సెల్స్‌ ఆచూకీ తెలియకుండా ఉండడం కోసం ఉగ్రవాదులు ఈ ఎత్తుగడలు వేస్తున్నట్టు భధ్రతాదళాలు గమనించాయి. స్థానికుల నుంచి ఇంటెలిజెన్స్‌ వర్గాలకు అందిన సమాచారం మేరకు  ఈ సైబర్‌ ఉగ్రవాద కార్యకలాపాల గుట్టుని భద్రతాదళాలు రట్టు చేశారు.    

లష్కరే కనుసన్నల్లో టీఆర్‌ఎఫ్‌
నిషేధిత లష్కరేతోయిబా నీడలో పనిచేస్తోన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)లోకి రిక్రూట్‌ చేసుకున్న తరువాత ఈ ఇరువురికీ పాకిస్తాన్‌కి చెందిన బుర్హాన్‌ హమ్జా నుంచి ఆదేశాలు అందుతాయి. అలాగే వీరికి మతసంబంధిత బోధనలు కూడా చేస్తారు. ప్రత్యేకించి దక్షిణ కశ్మీర్‌లో ఇలా సోషల్‌ మీడియా ద్వారా ఉగ్రవాద సంస్థల్లో చేరిన సంఘటనలు 40కి పైగా ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. కొత్తగా రిక్రూట్‌ అయిన వారు పాకిస్తాన్‌ నుంచి ఆదేశాల కోసం వేచి ఉన్నట్టు సమాచారం. టెర్రరిస్టు గ్రూపుల వద్ద తగినన్ని ఆయుధాలు లేకపోవడం వల్ల కూడా వారు నేరుగా రిక్రూట్‌మెంట్లు చేయకుండా, మ్యాన్‌ పవర్‌కంటే కూడా  ఆయుధ సమీకరణపై దృష్టిపెట్టినట్టు అర్థం అవుతోంది. గత నెలలో జమ్మూలో సరిహద్దుల్లో దొరికిపోయిన నలుగురు ఉగ్రవాదుల వద్ద 11 రైఫిల్స్, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి పట్టుబడటమే అందుకు ఉదాహరణ అని అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top