
ఎనభై దాటినా యాభైలో ఉన్నట్లే!
ఏళ్ల నాటి సంగతులూ మర్చిపోలేదు
మెదడా, లేక మంత్ర తంత్రమా!
పాతికేళ్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలు
మనిషి మెదడు వృద్ధాప్యంలో కుచించుకుపోతుంది. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. అయినప్పటికీ, ‘సూపర్ ఏజర్స్’ అని శాస్త్ర పరిశోధకులు పేర్కొంటున్న కొందరిలో అలా జరగటం లేదు! ఎనభై ఏళ్ల వయసు దాటినా, వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంటుంది. మనుషుల్ని చక్కగా గుర్తు పడతారు. 30 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలు సైతం చెరిగిపోకుండా ఉంటాయి.
అల్జీమర్స్‌తో వచ్చే మతిమరుపు, విశ్లేషణాత్మక శక్తి తగ్గడం వంటివి వారిలో లేవు. అసలు ఇదెలా సాధ్యం?! ఈ ప్రశ్నకు సమాధానంగా చికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకురాలు టామర్ గెఫెన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అల్జీమర్స్ అసోసియేషన్ జర్నల్. ‘అల్జీమర్స్ – డిమెన్షియా’ తన తాజా సంచికలో ఆ వివరాలను ప్రచురించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
టామర్ గెఫెన్.. చికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ‘మెసులమ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాగ్నిటివ్ న్యూరాలజీ అండ్ అల్జీమర్స్ డిసీజ్’ విభాగంలోని ‘సైకియాట్రి అండ్ బిహేవియరల్ సైన్సెస్’లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ‘సూపర్ ఏజింగ్ ప్రోగ్రామ్’లో ఆమె బృందం పరిశోధనలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్‌లో 113 సూపర్ ఏజర్‌లపై అధ్యయనం జరుగుతోంది.
వీరిలో 80 మంది సూపర్ ఏజర్‌లు.. గత 25 ఏళ్లలో ఈ కార్యక్రమానికి తమ మెదడు కణజాలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ కణజాలాలపై జరిగిన పరిశోధనలు తాజాగా మెదడు గురించి కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాయి. విశేషం ఏమిటంటే ఈ సూపర్ ఏజర్‌లలో గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారు కూడా ఉండటం!
300 మందిపై పరిశోధన
నార్త్‌వెస్టర్న్ కార్యక్రమంలో సూపర్ ఏజర్‌గా ఉండటానికి, ఒక వ్యక్తి 80 ఏళ్లు పైబడి ఉండాలి. మంచి గ్రాహకశక్తి కలిగి ఉండాలి. రోజువారీ సంఘటనలను, వ్యక్తిగత చరిత్రను గుర్తుంచుకునే సామర్థ్యం ఉండాలి. 50 లేదా 60 ఏళ్ల వయసులోని సాధారణ వ్యక్తుల కంటే కూడా మెరుగైన ధారణ శక్తి ఉండాలి. అలాంటి వారిలో గత 25 ఏళ్లలో 300 సూపర్ ఏజర్‌లపై గెఫెన్ బృందం అధ్యయనం జరిపింది.
అదృష్టమా? జన్యువులా?!
జన్యువులు.. దీర్ఘాయుషు, వృద్ధాప్యం, కణాల మరమ్మతు, జ్ఞాపకశక్తి వంటి అనేక అంశాలలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కానీ, సూపర్ ఏజర్‌లలో వారి అద్భుత జ్ఞాపకశక్తికి కారణం జన్యువులో, అదృష్టమో తేల్చుకోలేకపోయింది గెఫెత్ బృందం. ఇది తేల్చడానికి మరికొన్ని పరిశోధనలు, మరికొంత సమయం అవసరం కావచ్చు.
సూపర్ ఏజర్‌ల ప్రత్యేకతలు
టామర్ గెఫెన్ బృందం సూపర్ ఏజర్‌లలో ప్రధానంగా ఈ కింది లక్షణాలను, స్వభావాలను గుర్తించింది.
» సామాజిక సంబంధాలలో మెరుగ్గా ఉన్నారు.
» కమ్యూనిటీ పనులలో చురుగ్గా పాల్గొంటున్నారు.
» స్నేహాలకు, బంధాలకు విలువిస్తున్నారు
» స్వేచ్ఛ, స్వతంత్ర భావన కనిపించాయి.
» సలహాలు అడగరు. తామే నిర్ణయాలు తీసుకుంటారు.
» తమకు ఇష్టమైనట్లు జీవిస్తున్నారు.
పెద్దవిగా... ఎంటోర్హినల్ కార్టెక్స్!
సూపర్ ఏజర్ మెదడులోని ‘ఎంటోర్హినల్ కార్టెక్స్’లోని కణాలు పెద్దవిగా, ఆరోగ్యకరంగా ఉన్నాయి. జ్ఞాపకశక్తి, అభ్యాసానికి శక్తి జనింపజేసే ప్రాంతమే ఈ ఎంటోర్హినల్ కార్టెక్స్. ఇవి హిప్పోక్యాంపస్‌తో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉంటాయి. అల్జీమర్స్ వ్యాధి ప్రభావం మెదడులో మొదట ఎంటోర్హినల్ కార్టెక్స్ పైనే పడుతుంది. అయితే ఆ కార్టెక్స్ సూపర్ ఏజర్‌లలో బలంగా ఉంది. కార్టెక్స్‌లోని కణాల ప్రతి పొర కూడా భారీగా, బొద్దుగా, చెక్కుచెదరకుండా ఉంది.
తక్కువగా... మైక్రోగ్లియా కణాలు!
గెఫెన్ బృందం సూపర్ ఏజర్స్ మెదడులోని నొప్పి, వాపునకు ప్రభావితం అయ్యే కణ వ్యవస్థను కూడా పరిశీలించింది. వారిలో మెదడు పని చేయటానికి అవసరమైన మైక్రోగ్లియా కణాలు తక్కువ క్రియాశీలకంగా ఉన్నాయి. అంటే మైక్రోగ్లియా స్థాయిలు సూపర్ ఏజర్‌లలో 30, 40, 50 ఏళ్ల వ్యక్తులలో ఉన్నట్లే తక్కువగా ఉన్నాయి. దీనర్థం సూపర్ ఏజర్‌ల మెదడులో వ్యాధికారకాలు తక్కువగా ఉన్నాయని.
మందంగా.. సింగ్యులేట్ కార్టెక్స్!
యాభై, అరవై ఏళ్ల వారితో పోల్చి చూసినప్పుడు ఏకాగ్రతకు, ప్రేరణకు, గ్రాహ్యతకు కారణమైన ‘సింగ్యులేట్ కార్టెక్స్’ అనే మెదడు నిర్మాణం సూపర్ ఏజర్‌లలో మందంగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. అలాగే, మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోక్యాంపస్‌లోని ‘టౌ టాంగిల్స్’, తక్కిన వారితో పోల్చినప్పుడు సూపర్ ఏజర్‌లలో మూడు రెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. టౌ అనేది ఒక ప్రొటీన్. ఆ ప్రోటీన్ల అసాధారణ నిర్మాణం అల్జీమర్స్ ముఖ్య సంకేతాలలో ఒకటి. సూపర్ ఏజర్‌లలో టౌ టాంగిల్స్ తక్కువగా ఉన్నాయి కనుక వారి జ్ఞాపకశక్తి క్షీణించకుండా స్థిరంగా ఉంది.