
మాలీవుడ్ అగ్రతారలను జాతీయ దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్న వేళ.. సీనియర్ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమలై అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే సినీ తారలను తెర మీదకు తెచ్చారంటూ వ్యాఖ్యానించారాయన. ఆలయం నుంచి బంగారం మాయం కావడం కేరళను కుదిపేస్తుండగా(Sabarimala gold theft).. అక్కడి హైకోర్టు ఇప్పటికే సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం పాలక్కాడ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ గోపికి తారలపై జరుగుతున్న దర్యాప్తు సంస్థల సోదాల గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. శబరిమలై బంగారు చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఆ ఇద్దరు తారలను ముందుకు తెచ్చారని ఆరోపించారు. అయితే ఇలాంటి ఘటనలు అసాధారణం కావని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు.. ఇలా ప్రముఖుల ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారయన. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూడాల్సి వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. అయితే..
ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతున్నందున.. కేంద్రమంత్రిగా ఇంతకు మించి తానేం మాట్లాడబోనని ముగించారు. ఈ క్రమంలో ఎక్కడా ఆ కేసు ఏంటి? ఆ తారలు ఎవరు? అనే విషయాన్ని మాత్రం సురేష్ గోపి(Suresh Gopi reacts On Raids on Actors) ప్రస్తావించలేదు.
ఇదిలా ఉంటే.. భూటాన్-నేపాల్ మార్గం ద్వారా అక్రమంగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారనే అభియోగాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)లు ఆపరేషన్ నమ్‌ఖోర్(Operation Numkhor) చేపట్టాయి. అగ్రనటులు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు దుల్కర్ సల్మాన్, మరికొందరు తారల ఇళ్లలో తనిఖీలు చేశాయి. ఈ క్రమంలో దుల్కర్‌కు చెందిన రెండు కార్లను ఈడీ సీజ్ చేసింది. కోయంబత్తూర్‌కు చెందిన ఓ నెట్‌వర్క్ ద్వారా హవాలా మార్గంలో లావాదేవీలు జరిపి.. అక్రమ రిజిస్ట్రేషన్‌లతో లగ్జరీ కార్లు తెప్పించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో దుల్కర్ తండ్రి.. అగ్రనటుడు మమ్ముట్టి ఇళ్లు, ఆఫీసుల్లో కూడా తాజాగా సోదాలు జరిగాయి.
ఇక.. శబరిమలై అయ్యప్ప దేవాలయంలో బంగారం మాయం కావడం కలకలం రేపింది. 2019లో మరమ్మతుల కోసం పంపిన బంగారు విగ్రహాలపై 1.5 కిలోల బంగారం మాయమైందని తాజా విచారణలో బయటపడింది. ఈ అంశం ఇటు అసెంబ్లీని కుదిపేసింది. చివరకు.. హైకోర్టు ఆదేశాలతో SIT విచారణ కొనసాగుతోంది. ఈలోపు.. అయ్యప్ప యోగదండం కూడా మాయమైందన్న విషయం భక్తులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఇదీ చదవండి: శబరిమలై వివాదంలో మరో ట్విస్ట్