పతనంతిట్ట: శబరిమలై బంగారం అంశంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. శబరిమల గర్భగుడిలో ఉండాల్సిన అమూల్యమైన యోగదండాన్ని(పవిత్ర దండం) బంగారు పూత కోసం తీసుకెళ్లిన, తిరిగి ఇవ్వలేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పురాతన యోగదండాన్ని 2018లో బంగారు పూత కోసం తీసుకెళ్లారు. ఆ తర్వాత, కొత్తగా తయారు చేసిన యోగదండం తిరిగి తీసుకువచ్చారు. కానీ, అసలు యోగదండాన్ని మాయం చేశారు. ఈ యోగదండం వివరాలు ఎన్నడూ ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్‌లో ఎంట్రీ కాలేదని సమాచారం.
2018లో..
2018లో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) శబరిమల గర్భగుడిలోని అయ్యప్పస్వామి యోగదండానికి బంగారు పూత పూయించాలని నిర్ణయించింది. అక్కడే ఉండే రుద్రాక్ష మాలకు కూడా బంగారు పూత పూయించేందుకు తరలించారు. అయితే, ఈ వస్తువులను ఆలయం నుంచి బయటకు తీసుకెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలోని ఒక సీనియర్ అధికారి ఈ వస్తువులను బయటకు తీసినప్పుడు తూకం, అధికారిక మహజర్ (తనిఖీ రికార్డు)లో నమోదు చేయలేదని వెల్లడించారు .
ఇప్పటికీ దేవస్వం బోర్డు అధికారులకు యోగదండం, రుద్రాక్షకు ఎంత బంగారం పూశారు? అసలు వెండి భాగాలను తిరిగి ఉపయోగించారా? అనే సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. వాటిని తిరిగి ఇచ్చినప్పుడు వాటి బరువుకు సంబంధించిన రికార్డులు కూడా లేవు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, యోగదండం అత్యంత పురాతనమైనది. కనిపించకుండా పోయిన రుద్రాక్ష మాల కూడా దశాబ్దాల క్రితం నాటిది అని తెలుస్తోంది.
ఇదీ.. యోగదండం విశిష్టత
మండల-మకరవిళక్కుతోపాటు.. నెలవారీ పూజలు, ప్రత్యేక సందర్భాలలో జరిగే పూజల తర్వాత.. హరివరాసనాన్ని ఆలపించి, ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత అయ్యప్ప యోగనిద్రలో ఉంటారని భక్తుల విశ్వాసం. ఆలయాన్ని మూసివేసే ముందు.. అయ్యప్ప వద్ద యోగదండం పెడతారు. ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాలను స్వామిని అలంకరిస్తారు. భస్మాభిషేకంతో విగ్రహాన్ని మూసివేస్తారు. సాధారణంగా ఏకముఖీ రుద్రాక్ష అనేది అత్యంత ఖరీదైనది. ఇప్పుడు కనిపించకుండా పోయినది ఏకంగా ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాల. అదేవిధంగా యోగదండం అనేది అత్యంత పురాతనమైనది. దీని వెల అమూల్యమని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.


